Site icon vidhaatha

BUDJET 2024 | ఇది వివక్షతో కూడిన బడ్జెట్‌.. లోక్‌సభ నుంచి ఇండియా కూటమి వాకౌట్‌

అనేక రాష్ట్రాలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఎన్డీయే భాగస్వాముల పాలిత రాష్ట్రాలకే పెద్ద పీట
అన్ని రాష్ట్రాలనూ సమ దృష్టితో చూడాలని డిమాండ్‌
బడ్జెట్‌లో వివక్ష ఏదీ లేదన్న ఆర్థిక మంత్రి నిర్మల

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో పలు రాష్ట్రాలను అన్యాయంగా విస్మరించారని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు మండిపడ్డాయి. ఇది వివక్షతో కూడిన బడ్జెట్‌ అంటూ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ప్రజావ్యతిరేక, భాగస్వామ్య పార్టీలను ప్రసన్నం చేసుకునేలా బడ్జెట్‌ ఉన్నదని విమర్శిస్తూ నిరసనకు దిగాయి. పార్లమెంటు మకర్‌ ద్వార్‌ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, వివిధ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘ఎన్డీయే బడ్జెట్‌ కాదు.. ఇండియా బడ్జెట్‌ కావాలి’, భారతదేశానికి ఎన్డీయే ద్రోహం చేసింది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

న్యాయం కోసమే పోరాడుతున్నాం: ఖర్గే

‘అనేక రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరుగలేదు. న్యాయం కోసం మేం పోరాడుతున్నాం’ అని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘ఈ బడ్జెట్‌తో యావత్‌ దేశం నిరాశకు గురైంది. వారి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఈ బడ్జెట్‌.. అన్ని రాష్ట్రాల ప్రజలను నిరాశకు గురి చేసింది. ప్రభుత్వ ఉద్దేశాలు ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించాయి. ఈ బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేస్తున్నది’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత గౌరవ్‌ గగోయ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అమరిందర్‌సింగ్‌ రాజా వారింగ్‌ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ సమస్యల పరిష్కారాన్ని బడ్జెట్‌లో విస్మరించారని విమర్శించారు. ‘మేం ఈ రోజు పంజాబ్‌కు జరిగిన అన్యాయం గురించి నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌కు అన్నీ ఇచ్చారు. పంజాబ్‌కు వరద సహాయం మాత్రం ఇవ్వలేదు. పంజాబ్‌ ప్రజలు బీజేపీకి ఒక్క సీటును కూడా ఇవ్వలేదు. అందుకే పంజాబ్‌ను బీజేపీ విస్మరించింది’ అని విమర్శించారు. ప్రాజెక్టులను ఎంపిక చేసి కేటాయించడాన్ని ఆరెస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ తీవ్రంగా దుబయ్యబట్టారు. ‘కొన్ని రాష్ట్రాల పట్ల పూర్తి వివక్షతో కేంద్రం వ్యవహరించింది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు అనేక ప్రాజెక్టులు ఇచ్చారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీల పాలిత రాష్ట్రాలకు అధికమొత్తంలో కేటాయింపులు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’ అని ఆయన విమర్శించారు.

లాడ్లా బీహార్‌, లాడ్లా ఏపీ, లాడ్లా ఒడిశా : అర్వింద్‌ సావంత్‌

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉత్తరప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేశారని సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాం గోపాల్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌కు కేటాయింపుల సంగతి పక్కనపెడితే కనీసం బడ్జెట్‌లో యూపీ పేరు కూడా నోచుకోలేదు. వారి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కొందరికి నిధులు ఇచ్చి, మరికొన్నింటిని విస్మరించారు’ అని ఆయన అన్నారు. మహారాష్ట్రను విస్మరిస్తే సహించేది లేదు’ అంటూ ప్లకార్డు ప్రదర్శించిన ఆ రాష్ట్రానికి చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ అర్వింద్‌ సావంత్‌.. కొన్ని రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రయోజనాలను కల్పించడంపై సెటైర్లు వేశారు. లాడ్లా బీహార్‌, లాడ్లా ఆంధ్రప్రదేశ్‌, లాడ్లా ఒడిశాలదే ఈ బడ్జెట్‌. ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ప్యాకేజీ అడిగితే.. 15వేల కోట్లు ఇచ్చి వారి నోరు మూయించారు’ అని సావంత్‌ వ్యాఖ్యానించారు. ‘ఇద్దరు వ్యక్తులు.. నితీశ్‌కుమార్‌, చంద్రబాబు నాయుడు తప్ప దాదాపు ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్‌పై నిరాశతో ఉన్నారు’ అని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా విమర్శించారు. అన్ని ఆర్థిక నివేదికలు ఆదాయం పెరగడం లేదని, కానీ ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. దేశంలో ఇన్వెస్టర్లను ప్రభుత్వం శక్తిహీనం చేసింది. సమాజంలోని అన్ని సెక్షన్లను ఈ బడ్జెట్‌ ఆగ్రహానికి గురిచేసింది. ఈ బడ్జెట్‌లో తీసుకొచ్చిన జరిమానా నిబంధనలకు స్వస్తిపలకాలి’ అని అన్నారు.

ఉద్యోగాలు పీకేసి అప్రెంటిస్‌ షిప్‌లా? : అఖిలేశ్‌

రెండు రాష్ట్రాలకే అనేక వరాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌కు నిధులు కేటాయించడానికి మేం వ్యతిరేకం కాదు. కానీ.. ఇతర రాష్ట్రాలకూ న్యాయం జరుగాలి’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఉద్యోగాలు పీకేసీన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అప్రెంటిస్‌షిప్‌ గురించి మాట్లాడుతున్నదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. అధికార పక్షం రాష్ట్రాలు, ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలు అనే విభజనను బడ్జెట్‌లో చూపించారని డీఎంకే ఎంపీ టీ శివ ఆరోపించారు. ‘తమిళనాడుకు రావాల్సినవన్నీ నిరాకరించారు. కేంద్ర బడ్జెట్‌ ఈ దేశ బడ్జెట్‌ కాదు.. అది కేవలం ఎన్డీయే కూటమి బడ్జెట్‌’ అని విమర్శించారు.

అన్ని రాష్ట్రాల పేర్లూ ప్రస్తావించలేం కదా: నిర్మల

2024 కేంద్ర బడ్జెట్‌ వివక్షతో కూడినదన్న ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొట్టిపారేశారు. బడ్జెట్‌ ప్రతిపాదించే సమయంలో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించడం సాధ్యం కాదని అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ‘వదావన్‌లో ఓడరేవు నిర్మించాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. కానీ.. బడ్జెట్‌లో మహారాష్ట్ర పేరు ప్రస్తావనకు రాలేదు. దానర్థం మహారాష్ట్రను విస్మరించడమా? ఏదైనా రాష్ట్రం పేరు పలకకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ రాష్ట్రల్లో అమలు కావా?’ అని రాజ్యసభలో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘కుర్చీ కాపాడుకునే ఇదంతా. దీనిని మేం ఖండిస్తున్నాం. నిరసన వ్యక్తం చేస్తాం. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేస్తాయి. సమతుల్యం లేకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. అనంతరం ఇండియా కూటమి పక్షాలు సభనుంచి వాకౌట్‌ చేసి, నిరసనలో పాల్గొన్నాయి.

నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజరుకు దక్షిణాది రాష్ట్రాల సీఎంల నిర్ణయం

బడ్జెట్‌లో వివక్షను నిరసిస్తూ రాబోయే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాకూడదని ఇండియా కూటమి నుంచి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు.

Exit mobile version