Uttar Pradesh | లక్నో : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య శృంగారానికి అంగీకరించలేదని.. ఆమెను రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ఏరియాకు చెందిన తీజా అనే యువతి ముకేశ్ అహిర్వార్ అనే వ్యక్తిని 2022లో వివాహం చేసుకుంది. ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. బతికున్నంత కాలం మంచిగా చూసుకుంటానని ఆ దేవుడి సాక్షిగా ముకేశ్ ప్రమాణం చేశాడు. ఓ ఏడాది కాలం వారి సంసార జీవితం సుఖసంతోషాలతో సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత ముకేశ్ ఇంటికి రావడం మానేశాడు. బయటనే అధిక సమయం గడుపుతున్నాడు. దీంతో భార్య ప్రశ్నిస్తే ఆమెను తీవ్రంగా కొట్టి హింసించే వాడు.
అయితే సోమవారం ముకేశ్ భార్య తీజా వద్దకు వచ్చాడు. రాత్రంతా ఆమెను తీవ్రంగా కొట్టాడు. మళ్లీ మంగళవారం కూడా హింసించాడు. తనతో శృంగారం చేయాలని మద్యం మత్తులో బలవంతం చేశాడు. భర్తతో శృంగారానికి భార్య అంగీకరించలేదు. ఆగ్రహావేశాలకు లోనైన ముకేశ్.. భార్యన రెండు అంతస్తుల భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసేశాడు.
తీవ్ర గాయాలు, రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు గమనించి.. సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ముకేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
