Site icon vidhaatha

BRS Family Politics | కేసీఆర్ అంతఃపురంలో అలజడి!.. హరీశ్‌రావు, కవితలకు సీఎం రేవంత్ రెడ్డి ఎర!

BRS Family Politics | మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతఃపురంలో అలజడి రేగిందని.. బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట సాగుతున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో చీలిక రాబోతున్నదని, హరీశ్‌, కవితకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ రెండుగా చీలిపోయే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. రజతోత్సవ సభలో కూడా హరీశ్‌, కవితకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆ పార్టీలో ముసలం రేగిందని చెప్పారు. బీఆర్ఎస్‌ను ఇప్పుడు కేటీఆర్ నడిపిస్తున్నారని, హరీశ్‌రావు, కవిత డమ్మీలుగా మారిపోయారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజెంట్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ కూడా ఆయనకే పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఏలేటి వ్యాఖ్యానించారు.

కవిత విమర్శలు వ్యూహాత్మకం

బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరిగా మారిపోవడంతో మహిళా సాధికారత.. సామాజిక తెలంగాణ సాధనలో నాటి బీఆర్ఎస్ సర్కారు విఫలం అంటూ వ్యూహత్మకంగా విమర్శలు చేశారని ఏలేటి అభిప్రాయపడ్డారు. పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్ కేనా? అంటూ తండ్రిపై కవిత లేఖాస్త్రంతో తిరుగుబాటు చేశారని అన్నారు. త్వరలో ఆ లేఖను కవిత బయటపెట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. రాజకీయంగా కవితను అణచివేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని అది కూడా తన చూట్టూనే ఉండాలనేది కేటీఆర్‌ అభిమతంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒత్తిడితోనే హరీశ్‌రావు ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. కేటీఆర్ అధ్యక్షుడు అయితే.. బీఆర్ఎస్ఎల్పీ తనకే ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్ చేశారని ఏలేటి వెల్లడించారు.

బీఆర్ఎస్ఎల్పీ చీలికకు రేవంత్ ప్రయత్నం

మరోవైపు పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే ఎల్పీ పదవి ఇస్తానని హరీశ్‌రావుకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారని ఏలేటి ఆరోపించారు. హరీశ్‌ను బీఆర్ఎల్పీ లీడర్‌గా, కవితను కౌన్సిల్ లీడర్‌గా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయం తెలిసిన కేటీఆర్ ముందెన్నడూ లేని రీతిలో హరీశ్‌రావు ఇంటికి వెళ్లారన్నారు. బావ. బావమరుదల చర్చల్లో హరీశ్‌రావు ఎల్పీ పదవి అడిగితే పార్టీ ప్రెసిడెంట్, ఎల్పీ రెండు తన వద్దే ఉంచుకుంటానని హరీశ్‌ను బతిమలాడారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్‌ను చీల్చడం తమకు సాధ్యం కాకపోవడంతో.. హరీశ్‌రావును అడ్డం పెట్టుకొని పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారని ఏలేటి ఆరోపించారు. మే 26 నుంచి కేటీఆర్ ఫారిన్ టూర్ కి వెళ్తున్నారని, ఆయన అటు వెళ్లగానే ఇటు బీఆరెస్‌ఎల్పీ చీలిక తథ్యమని ఏలేటి మహేశ్వ్ రెడ్డి జోస్యం చెప్పారు.

Exit mobile version