Telangana Jagruthi | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడు మీద ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలతో పాటు సొంత పార్టీ బీఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలపై కూడా విమర్శలు సంధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన కవిత.. తాజాగా తన సారథ్యంలోని తెలంగాణ జాగృతి విభాగాలకు రాష్ట్ర కన్వీనర్లను నియమించారు. బీఆరెస్‌కు అనుబంధంగా మహిళ, యువజన, విద్యార్థి, లీగల్, తదితర కమిటీలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సమయంలో బీఆరెస్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతి మళ్లీ ప్రత్యేకంగా మహిళ, యువజన, విద్యార్థి విభాగాలు ఏర్పాటు చేయడం విశేషం. నూతన కన్వీనర్లు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా మరిపెల్లి మాధవి, యువజన సమాఖ్య కన్వీనర్‌గా ఎదురుగట్ల సంపత్ గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్‌గా అప్పాల నరరేందర్ యాదవ్, విద్యార్థి సమాఖ్య కన్వీనర్‌గా జానపాటి రాము యాదవ్, యవజన సమాఖ్య హైదరాబాద్ నగర కన్వీనర్‌గా పరకాల మనోజ్ గౌడ్‌లను నియమించారు.
హాట్ టాపిక్ గా కవిత రాజకీయం
ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం మరోసారి బీసీ నినాదంతో జిల్లాల పర్యటన.. కుల సంఘాలు, ప్రజాసంఘాలతో వరుస భేటీలతో రాజకీయంగా కవిత మళ్లీ ఫుల్ జోష్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లుపైన సమావేశాలతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైన నిత్యం తనదైన శైలిలో శాసన మండలిలో, బయటా స్పందిస్తూ వచ్చారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో.. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలతో కినుక వహించిన కవిత తనపై పార్టీలో అణిచివేత కుట్ర సాగుతోందంటూ పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారనే వార్తలు గుప్పమన్నాయి. తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో కుట్రలు చేస్తున్నది ఎవరో తనకు తెలుసని.. సమయం వచ్చినప్పుడు బయటపెడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కవిత బీఆరెస్‌ను వీడుతారా? సొంతంగా పార్టీ పెడుతారా? అన్న చర్చలు మొదలయ్యాయి. ఇది ఇలా ఉండగానే కవిత తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు కన్వీనర్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.