Site icon vidhaatha

Gaming Apps: 357 ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్ బ్లాక్‌.. 2,400 బ్యాంక్ ఖాతాలు సీజ్ !

విధాత: అక్రమ మనీ గేమింగ్ వెబ్ సైట్లపై డీజీజీఐ (Directorate General of GST Intelligence) చట్టపర చర్యలు చేపట్టింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఆన్ లైన్ మీన గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలను సీజ్..అటాచ్ చేసినట్లుగా వెల్లడించింది. ఆ సంస్థలకు చెందిన రూ.126 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు పేర్కొంది. మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో అప్రమత్తంగా ఉండాలని.. వాటిని ఎవరూ వినియోగించొద్దని డీజీజీఐ సూచించింది. కొన్ని సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాన్ని దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా వేసినట్లు పేర్కొంది.

దేశం వెలుపల ఈ తరహా సంస్థలు నడుపుతోన్న పలువురు భారతీయులపై డీజీజీఐ మరో ఆపరేషన్ చేపట్టి.. వారికి సంబంధించిన 166 ఖాతాలను బ్లాక్‌ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది. చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఈ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆ ప్లాట్‌ఫామ్స్‌ వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీసే అవకాశం ఉందని.. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జీఎస్టీ చట్టం ప్రకారం.. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ రంగంలో పని చేస్తున్న సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఐపీఎల్‌ సీజన్‌తో సహా చట్టవిరుద్ధమైన గేమింగ్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకున్నామని.. 357 వైబ్‌సైట్స్‌ని ఐటీశాఖ సమన్వయంతో బ్లాక్‌ చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

Exit mobile version