Site icon vidhaatha

Bhoodan Land Scam | భూదాన్ భూముల స్కామ్.. పాతబస్తీలో ఈడీ సోదాలు

Bhoodan Land Scam |

విధాత: భూదాన్ భూముల వివాదంకు సంబంధించి అక్రమాల అరోపణలపై ఈడీ హైదరాబాద్ పాతబస్తీలు తనిఖీలు నిర్వహించింది. మునావర్ ఖాన్, ఖదీర్ యూనస్ షర్ఫాన్, షుకూర్ ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మహేశ్వరం పరిధిలోని భూదాన్ భూములలో అక్రమంగా లే అవుట్ చేసి విక్రయించిన వ్యవహారంలో ఈడీ మునావర్ ఖాన్, ఖదీర్ యూనస్ షర్ఫాన్, షుకూర్ ల ఇళ్లలో తనిఖీలు చేపట్టిందని సమాచారం. పాతబస్తీ రీన్‌ బజార్‌, సంతోష్‌ నగర్‌లలోని వారి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.

ఈఐపీఎల్ కంపెనీ పేరిట భూదాన్ భూములలో అక్రమ వెంచర్లు వేసి ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఈ భూములను విక్రయించినట్లుగా అరోపణలున్నాయి. కంపెనీకి షుకూర్ అనే వ్యక్తి బినామీగా ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్, మహేశ్వరం తహశీల్దార్‌ను ఈడీ విచారించింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 50 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతమైంది. సర్వే నెంబర్ 181, 182లోని 100 ఎకరాల భూమిపై కూడా కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి తమకు చెందినదిగా భూదాన్ బోర్డు వాదిస్తోంది. ఆ భూములు కాలక్రమేణా చేతులు మారుతూ వస్తూ చివరికి 2021లో హజీఖాన్ వారసురాలిని తానేనంటూ ఖాదిరున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. దాంతో ఆ భూములు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలతో ఈ భూ వివాదాలపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ వివాదస్పద భూమి ద్వారా ఎవరెవరు లబ్ది పొందారు అన్న వివారాలు సేకరించడం కోసం ఈడీ విచారణ చేస్తోంది.

ఇందులో భాగంగానే అప్పటి కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఆర్‌ఐ అధికారులను ఇప్పటికే ఈడీ విచారించింది. కొందరు అధికారులు సదరు మహిళకు అనుకూలంగా పనిచేసినట్లు గుర్తించింది ఈడీ. ఆ తర్వాత ఆ భూములు రియల్ ఎస్టేట్ సంస్థ చేతికి వెళ్లినట్లు నిర్ధారితమైంది. ఈ భూములను సొంతం చేసుకోవడానికి భారీగా ఆర్థిక లావాదేవిలు జరపడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ విచారణలో భాగంగానే తాజాగా మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి సహా రియల్ ఎస్టేట్ బిల్డర్లను విచారించాలని వారికి నోటీసులు జారీ చేసింది.

అటు తనిఖీలు.. ఇటు నోటీసులు

మరోవైపు భూదాన్ భూముల అన్యాక్రాంతంకు సంబంధించి 181, 182 సర్వేనెంబర్లతో పాటు 194, 195సర్వే నెంబర్లపై కూడా వివాదం నడుస్తుంది. అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారని పిటిషన్ వేశారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హైకోర్టు తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఆ భూములన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చాలని ఆ జిల్లా కలెక్టర్, రిజిస్ట్రార్ లకు ఆదేశాలిచ్చింది. భూదాన్ భూములను నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ లు, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్క, రిజిస్ట్రార్, భూదాన్ బోర్డు, సీసీఎల్ఏ, సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూములకు సంబంధించి 73మంది నోటీసులు జారీ కాగా వారిలో 30మంది ఐఏఎస్, ఐపీఎస్, వారి కుటుంబ సభ్యులే ఉండటంతో ఈ కేసు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 12కు వాయిదా వేశారు.

Exit mobile version