విధాత, హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. టర్కీ కాన్సులేట్ జనరల్ ప్రాంతంలో పోలీస్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. భారత్ తో సైనిక ఘర్షణకు తలపడుతున్న పాక్ 400 డ్రోన్‌లతో భారత్ పైకి దాడి చేసింది. వాటిని భారత సైన్యం పేల్చివేయడం తెలిసిందే. అవన్ని కూడా టర్కీ ఇచ్చినవే.
ఈ విషయం భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. భూకంపంతో అతలాకుతలమైన టర్కీకి భారత్ భారీగా మానవతా సహాయం చేసింది. టర్కీ మాత్రం భారత్ చేసిన సహాయాన్ని మరిచి పాకిస్థాన్‌కు డ్రోన్‌లు అందజేయడంపై భారత్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే వార్ సైరన్లను సైతం ఇతరులు ఎవరు వాడరాదని కేంద్రం ఆదేశాలు జారీచేసంది.