విధాత ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతో తాను కలిసి పని చేస్తున్నానని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి సాగుతున్నానని మాజీ డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హనుమకొండలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చానని చెప్పారు. దురదృష్టవశాత్తు తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మారిపోయానని, ఈ కారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో, ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చారని, ఆ నిధులతో పనులు చేపట్టామని తెలిపారు.
15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అక్రమాలు అవినీతికి పాల్పడిన నాయకులు, చిలిపి చేష్టలు చేసి ప్రజల తిరస్కరణకు గురైన సిగ్గుమాలిన నాయకులు ప్రశ్నిస్తే తాను సమాధానం చెప్పనని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీ వరకు పోయి పార్టీలో చేరుదామంటే స్థానిక మహిళలు ఇలాంటి నాయకుడు తమ పార్టీలోకి రావద్దని సమ్మక్క సారలమ్మ లను మొక్కుకున్నారని ఎద్దేవా చేశారు. మంచితనం ఉంటే పార్టీలో చేర్చుకుంటారని, అవసరమైతే ఆహ్వానిస్తారని అన్నారు.
కెసిఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు, చేర్చుకున్న వారిలో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని కడియం గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ లో చేరిన వారెవరు రాజీనామా చేయలేదన్నారు. బీఆర్ఎస్ అగ్రనేతులకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అంటూ కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లను ఉద్దేశించి కడియం శ్రీహరి ప్రశ్నించారు.
అసెంబ్లీ స్పీకర్ నోటీస్ ఇచ్చారు… ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. తాను ఏ పార్టీలో ఉందనేది స్పీకర్ తేలుస్తారని చెప్పారు. పార్టీ మారి, తాను పదవి అనుభవించలేదని అన్నారు. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని కడియం అన్నారు. తాను స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసమే కట్టుబడి ఉంటానని, ఆ ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష ఇచ్చింది, ఈ స్థాయికి ఎదిగేందుకు సహకరించింది స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలేనని ఆయన అన్నారు.
నియోజకవర్గంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిపూర్తికి రూ.148 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కడియం వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ పరిధిలోని స్టేషన్గన్పూర్, అశ్వరావు పల్లి, లింగాల గణపురం, నవాబ్ పేట రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి వాటి ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపామని జలకళతో నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని వివరించారు. ప్రధాన కాలువలలో పేరుకుపోయిన పూడిక, జంగల్ కటింగ్ చేపట్టి నియోజకవర్గ రైతులకు నీళ్లు అందించడమే లక్ష్యంగా సాగుతున్నామని కడియం స్పష్టం చేశారు.