Kunamneni Sambasiva Rao | తీవ్ర పేదరికంతో ఉన్న భారతదేశాన్ని పేదరికంలేని దేశంగా కృత్రిమంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అందుకే జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటేసిందని చెబుతున్నారని అన్నారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. అర్థికంగా దేశం అభివృద్ధి చెందితే ఇంకా అనేక మంది పేదరికంలో ఎందుకు మగ్గుతున్నారని ప్రశ్నించారు. ఆకలితో అలమటిస్తున్నవారిలో దేశం 101 స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇకపై ఖర్చు చేయొద్దని సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం… కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నేడు నోరు మూసుకున్నారని విమర్శించారు. తన మెదడును కరిగించి డిజైన్ చేశానని, కాళేశ్వరానికి అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు నాకు సంబంధం లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాధ్యత ఇంజినీర్లదే అని నేడు తప్పించుకుంటున్నారని అన్నారు. జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని తాము డిమాండ్ చేశామని, అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని జిల్లాలకు సాగునీరు అందేదని చెప్పారు. నేడు పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని చెప్పారు.
కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్
ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కలలు కంటున్నదని కూనంనేని విమర్శించారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతున్నదని అన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు. మీడియా సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, నాయకులు కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.