Site icon vidhaatha

M & M: సత్తా చాటిన మహీంద్రా.. 19 శాతం వృద్ధి నమోదు

ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ 2025 ఏప్రిల్ లో మొత్తం 84,170 ఆటో విక్రయాలు నమోదు చేసి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19 శాతం వృద్ధిని సాధించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల వాహన విభాగంలో, యుటిలిటీ వాహనాల దేశీయ విక్రయాలు 28 శాతం పెరిగి 52,330 యూనిట్లకు చేరాయి, గత ఏడాది ఏప్రిల్‌లో 41,008 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన ఉన్నతి కనిపించింది. దేశీయ మార్కెట్‌లో వాణిజ్య వాహనాల విక్రయాలు 22,989 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. “గత ఏడాది బలమైన పనితీరును కొనసాగిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్‌లో 52,330 యూనిట్ల SUV విక్రయాలతో 28 శాతం వృద్ధిని, మొత్తం 84,170 యూనిట్ల వాహన విక్రయాలతో 19 శాతం వృద్ధిని సాధించాం. ఈ సంఖ్యలు మా ఉత్పత్తుల వైవిధ్యం, కస్టమర్ ఆకర్షణల బలాన్ని సూచిస్తున్నాయి” అని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా అన్నారు.

వ్యవసాయ సామగ్రి విభాగంలో, ఏప్రిల్ 2025లో మొత్తం ట్రాక్టర్ విక్రయాలు (దేశీయ, ఎగుమతి) 8 శాతం పెరిగి 40,054 యూనిట్లకు చేరాయి, గత ఏడాది ఏప్రిల్‌లో 37,039 యూనిట్లతో పోలిస్తే. దేశీయ మార్కెట్‌లో ట్రాక్టర్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 38,516 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 25 శాతం పెరిగి 1,538 యూనిట్లకు చేరాయి. “పంట సీజన్ సానుకూలంగా సాగుతోంది, త్వరలో ముగియనుంది. ఏప్రిల్ మొదటి వారంలో చైత్ర నవరాత్రి పండుగ, మండీలలో అధిక సేకరణ వల్ల రైతులకు నగదు ప్రవాహం బలంగా ఉంది. ఇది రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచింది” అని మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. “ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయనే ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, ట్రాక్టర్ పరిశ్రమకు సానుకూలంగా మారింది. ఫైనాన్సింగ్ కూడా బలంగా కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.

8 శాతం వృద్ధితో..
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వ్యవసాయ సామగ్రి విభాగం (FES) ఏప్రిల్ 2025కి సంబంధించిన ట్రాక్టర్ విక్రయాల సంఖ్యలను ప్రకటించింది. ఏప్రిల్ 2025లో దేశీయ మార్కెట్‌లో 38,516 యూనిట్ల విక్రయాలు నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ 2024లో 35,805 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి అని సంస్థ వెల్లడించింది. మొత్తం ట్రాక్టర్ విక్రయాలు (దేశీయ + ఎగుమతులు) ఏప్రిల్ 2025లో 40,054 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో 37,039 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో ఎగుమతులు 1,538 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అంశంపై మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వ్యవసాయ సామగ్రి విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కా మాట్లాడుతూ… “ఏప్రిల్ 2025లో దేశీయ మార్కెట్‌లో 38,516 ట్రాక్టర్లను విక్రయించాము. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించాము. పంట సీజన్ సజావుగా సాగుతోంది, త్వరలో ముగియనుంది. ఏప్రిల్ మొదటి వారంలో చైత్ర నవరాత్రి పండుగతో రిటైల్ డిమాండ్ బలంగా నమోదైంది. ఫైనాన్సింగ్ సౌకర్యాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి. ఎగుమతి మార్కెట్‌లో 1,538 ట్రాక్టర్లను విక్రయించాము, గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది” అని తెలిపారు.

Exit mobile version