విధాత: ఐపీఎల్ టీమ్స్ కు బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్.. బెట్టింగ్ హెచ్చరికలను జారీ చేయడం సంచలనంగా మారంది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కి ప్రయత్నించాడని.. ఐపీఎల్ ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను, కామెంటేటర్స్, సిబ్బందిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లోవారిని భాగం చేయాలని కుట్ర జరుగుతోందని.. దీనిపై జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ హెచ్చరించింది.
ఎవరినైనా అనుమానంగా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని అన్ని జట్లను బీసీసీఐ ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త ఇటీవల మరింత యాక్టివ్ అయ్యారని.. అతనికి క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన అనుభవం కూడా ఉందని హెచ్చరించింది. అతను ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్(ACSU)కి సమాచారం అందిందని పేర్కొంది. పుంటెర్స్, బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలిసిందని హెచ్చరించింది.ఆ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్‌లు, ఆభరణాలతో బుట్టలో పడేస్తాడని ఏసీఎస్‌యూ తెలిపింది.
ఖరీదైన గిఫ్టులతో ఉచ్చులోకి..
కాగా ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లను, కోచ్‌లను కలిసి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్‌కు వెళ్తాడని తెలిసింది. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేటు పార్టీలకు కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఏసీఎస్‌యూ అనుమానం వ్యక్తం చేసింది.
సదరు వ్యాపారవేత్త ప్లేయర్లకు, కోచ్‌లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎవరైన వ్యక్తి సంప్రదిస్తే- జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. బీసీసీఐ హెచ్చరికలు ఐపీఎల్ జట్లలో తీవ్ర కలకలం రేపాయి. గతంలోనూ ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ టోర్నీపై నిఘా వేసింది.