హైదరాబాద్, ఏప్రిల్7(విధాత): HCUపై కాంగ్రెస్ సర్కారు దిద్దు బాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా విద్యార్థులపై మోదైన కేసులను ఎత్తి వేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోలీస్ అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు ఉన్నది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ విద్యార్థుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణించినప్పుడు జరిగిన ఆందోళనల్లో విద్యార్థులకు మద్దుతుగా రాహుల్ గాంధీ అప్పట్లో యూనివర్సిటీకి వచ్చాడు. అలా హెచ్‌సీయూ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇదే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని విక్రయానికి పెట్టడం ఈ ఆందోళనలకు ఊతం ఇచ్చింది. ఈ సమస్యలను అందిపుచ్చుకున్న BRS యూనివర్సిటీలో అడుగు పెట్టింది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపింది. ఈ సమస్య చిలికి చిలికి గాలివానలా మారడం, సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం వరకు వెళ్లడంతో కాంగ్రెస్ అధిష్టానం వెంటనే దిద్దు బాటు చర్యలకు దిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ను అధిష్టానం హుటా హుటిన హైదరాబాద్‌కు పంపించింది. రాష్ట్రానికి వచ్చిన నటరాజన్ వెంటనే సెక్రటేరియట్‌కు వెళ్లి మంత్రుల కమిటీతో మాట్లాడింది. ఆతరువాత యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించింది. కంచెగచ్చిబౌలిఒ భూముల పరిశీలనకు వెళ్లింది.
అయితే వివాదాస్పధ భూముల పరిశీలనకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో వెనుతిరిగింది. యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన తరువాత పరిస్థితిపై అంచనాకు వచ్చిన నటరాజన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పలు సూచరలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని, యూనివర్సిటీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ సూచనలతో సోమవారం సచివాలయంలో యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులపై కేసులను ఎత్తి వేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో హెచ్ సీ యూ భూముల వేలం వేయాలన్న నిర్ణయంపై ముందుకు వెళ్లే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత అభిప్రాయ పడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా వెళ్ల కూడదని అధిష్టానం కూడా సీఎం రేవంత్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
HCU విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించండి: డిప్యూటీ సీఎం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో Hcu టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి చర్చల తదుపరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.