విధాత: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఇమేజ్ రీ ట్వీట్ చేయడంలో ఐఏఎస్ స్మితాసబర్వాల్ తప్పేమి లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ కమ్యూనిటీ హాలులో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి విషయంలో సీఎస్ శాంతికుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం బాధించిందని తెలిపారు.
ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని, కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌లో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని పేర్కొన్నారు. అంతేగానీ ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమీ లేదని వివరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ప్రజలు చూడాలని ఆశ పడుతున్నారని.. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని అభిప్రాయపడ్డారు.