శ్రీనగర్: పహల్గామ్ దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేసిన భారత భద్రతాదళాలు.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలకు వెళ్లిన భద్రతాదళాలు.. అందులో అప్పటికే పేలుడు పదార్థాలు అమర్చినట్టు గుర్తించి, బయటకు వచ్చేశాయి. ఆ కాసేపటికే అవి పేలిపోయాయి. పుల్వామాలో ఎసాన్ ఉల్, షోపియాలో షబీర్ అహ్మద్, కుల్గామ్‌లో జకీర్ ఘనీ ఇళ్లను తాజాగా పేల్చివేశాయి.
ఇంతకు ముందు అదిల్ ఇంటిని పేల్చివేశారు. అదిల్ 2018లో వాఘా సరిహద్దు ద్వారా అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి పహల్గామ్ దారుణానికి కూడా ప్రణాళిక రూపొందించడంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భారత బలగాలు ముమ్మరం చేశాయి. జమ్ము కశ్మీర్ అణువణువునూ క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి.
ఈ సందర్భంగా అనుమానం వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారిలో ఇద్దరిని ప్రశ్నించిన సందర్భంగా.. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు కుల్గామ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరిద్దరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన భద్రతాదళాలు.. వారి ఆచూకీ తెలిపినవారికి 20 లక్షలు నజరానా ఇస్తామని ప్రకటించాయి.