Russia-Ukraine War: పుతిన్‌ సంచలన నిర్ణయం.. మే నెలలో మూడు రోజులు సీజ్‌ఫైర్‌

Russia-Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 2025 మే 8 నుంచి మే 10 వరకూ ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పల విరమణ పాటించనున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణ నివారణకు కొనసాగుతున్న దౌత్యపరమైన చర్యలు, నిలిచిపోయిన శాంతి చర్చల నేపథ్యంలో పుతిన్‌ నిర్ణయం అనూహ్యంగా వచ్చింది. తాము ప్రకటించిన రోజుల్లో ఉక్రెయిన్‌ కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తుందాన్న ఆశాభావాన్ని […]

Russia-Ukraine War:

ఉక్రెయిన్‌, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 2025 మే 8 నుంచి మే 10 వరకూ ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పల విరమణ పాటించనున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణ నివారణకు కొనసాగుతున్న దౌత్యపరమైన చర్యలు, నిలిచిపోయిన శాంతి చర్చల నేపథ్యంలో పుతిన్‌ నిర్ణయం అనూహ్యంగా వచ్చింది. తాము ప్రకటించిన రోజుల్లో ఉక్రెయిన్‌ కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తుందాన్న ఆశాభావాన్ని క్రెమ్లిన్‌ వ్యక్తం చేసింది. ఈ చర్య.. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన ప్రత్యక్ష చర్యలకు కీలకమైన అడుగుకు సంకేతంగా భావిస్తున్నారు.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య 2022 ప్రారంభంలో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మొదటిసారి వన్‌ టూ వన్‌ శాంతి చర్చలకు బేషరతుగా రష్యా ప్రభుత్వం ముందుకు రావడం ఇదే మొదటిసారి. అయితే.. ఉక్రెయిన్‌ కూడా అటువంటి చర్చలకు సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వాలని రష్యా కోరుకుంటున్నది. వాస్తవానికి ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా ఆక్రమించిన తర్వాత ఆ దేశంతో ప్రత్యక్ష చర్చలపై చట్టబద్ధంగానే ఉక్రెయిన్‌ నిషేధం విధించింది.

గతంలోనూ స్వల్ప విరామాలతో సీజ్‌ఫైర్‌ను ఇరు దేశాలు పాటించాయి. 2025లో పుతిన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఈస్టర్‌ ట్రూస్‌ కూడా అందులో ఒకటి. అది కేవలం 30 గంటలకే పరిమితమైంది. ఈ సమయంలో కూడా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది. అయితే.. తాజాగా ప్రకటించిన సీజ్‌ ఫైర్‌ ఎక్కువ రోజులు కలిగి ఉండటంతోపాటు ముందే ప్రకటించడం సానుకూల అంశంగా కనిపిస్తున్నది. ముందుగానే ప్రకటించడం వల్ల ఇరు పక్షాలూ అందుకు సమాయత్తమయ్యే అవకాశం ఉన్నది.