Rythu Bharosa Funds | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికి రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా అందించబోతున్నామని..నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు (Rythu Bharosa Funds) జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తొలి రోజు మొత్తం 42.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2349.83 కోట్లు జమ అయ్యాయి. ఇందులో ఎకరం లోపు రైతులకు రూ.812.6 కోట్లు, రెండు ఎకరాల వరకు రూ.1537.2 కోట్లు చెల్లించారు. ఈ ప్రక్రియ మరో 8 రోజుల్లో పూర్తి కానున్నది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో సోమవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో కొత్తగా 1034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని.. ప్రజాప్రభుత్వం 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని..దీనిపై ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్దమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పకొచ్చారు. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించామని..సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించామని తెలిపారు. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో నెత్తిమీద అప్పు..చేతిలో చిప్ప
గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు..చేతిలో చిప్ప పెట్టారన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసంతో రాష్ట్రం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితిలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారన్నారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారని..పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారని..అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ..ముందుకు వెళుతున్నామన్నారు. కొంత కాలమైనా సమయం ఇవ్వరా.. ? సరిదిద్దుకొనివ్వరా? అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థుల చావులను రాజకీయం చేస్తుందని..చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుందన్నారు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా మనల్ని విమర్శిస్తున్నారు.
భార్యభర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గ పరిస్థితి కొనసాగిందని..మా ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందమని..ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం అని పేర్కొన్నారు. రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నామన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలని..భూమి రైతుకు ఆత్మగౌరవమని..భూభారతి ద్వారా రైతుల భూ హక్కులకు భద్రత కల్పించామన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, రైతులతో పాటు అన్ని జిల్లాల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.