Pumped Storage Power Plant | వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సింగరేణి సంస్థ మరో వినూత్న విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలు పూర్తిచేసిన కంపెనీ సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సీఎండీ శ్రీ ఎన్. బలరామ్ తెలియజేశారు. ఈ తరహా ప్రాజెక్టు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ చేపట్టలేదని, సింగరేణి సంస్థ దీనిని ప్రయోగా త్మకంగా చేపట్టడమే కాక విజయవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ప్లాంటును ఏర్పాటు చేయనున్న మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు ను, నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా సందర్శించారని, ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ప్రాజెక్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
సింగరేణి సంస్థ అప్పగించిన బాధ్యతల ప్రకారం వ్యాప్కోస్.. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంప్ ఆధారంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మించడానికి సంబంధించిన పూర్తి అధ్యయనం నిర్వహిస్తుంది. ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఒక రకంగా జల విద్యుత్తు ప్రాజెక్టు తరహాలో పనిచేస్తుంది. జల విద్యుత్తు కేంద్రాలలోనీటి ప్రవాహ ఉధృతికి టర్బైన్లు తిరగటం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అక్కడ సహజ సిద్ధమైన జలపాతాల నీటిని ఇందుకోసం వినియోగిస్తారు. కాగా పంపుడు స్టోరేజీ ప్లాంట్లు ఎత్తయిన ప్రదేశానికి తోడిన నీటిని కిందికి వదలడం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
మేడిపల్లిలో భారీ నీటి సంప్
ప్రస్తుతం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి, ఏడాది పొడుగునా భారీ పరిమాణంలో నీరు నిలవ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించనున్న దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్ లోనికి పగటిపూట సోలార్ విద్యుత్ ద్వారా పంపింగ్ జరుపుతారు. ఈ విధంగా పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ కిందికి పంపిస్తూ ఆ జల శక్తితో, మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పడం వలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కింద ఉన్న నీటిని పైకి పంపిణీ చేసి, అలా అక్కడ నిలువ చేసిన నీటిని కిందికి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు కనుక దీనినీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అని పిలుస్తున్నారు. మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని లో గల భారీ నీటి సంపు, ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ ప్రదేశ లభ్యతలు ఇక్కడ ఉండటం వల్ల సింగరేణి మొత్తంలో ఈ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉపరితలంపై నీటి నిల్వ కోసం సుమారు 2,350 మీటర్ల పొడవు తో 23 మీటర్ల లోతు గల రిజర్వాయర్ డ్యాము ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ లో 9.64 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటిని నిలువ చేసి దీనిలో నుండి పంపింగ్ కోసం 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తారు. ప్రాజెక్టు వ్యయం సుమారు 3000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. అయినప్పటికీ 40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంటు సింగరేణికి గట్టి ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థ డిపిఆర్ సిద్ధం చేయగానే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచే అవకాశం ఉంది.