విధాత: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రదాడి ఘటనపై రిటైర్డు జడ్జీతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఫతేష్ సాహూ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.‘‘ఇది చాలా క్లిష్ట సమయమని..ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీకు కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.
ఎప్పటి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు దర్యాప్తుల్లో నిపుణులు అయ్యారని కోర్టు ప్రశ్నించింది. తాము కేవలం వివాదాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది. దర్యాప్తులు చేయడం తమ పనికాదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికింది. ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారు’’ అని ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది. కోర్టు సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.