తమిళనాడు స్వయంప్రతిపత్తికి కమిటీ!!
విధాత: గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా 10బిల్లులను అమల్లోకి తెచ్చిన సీఎం ఎం.కే.స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయంప్రతిపత్తి (Tamil Nadu autonomy)పై సూచనలకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ సారథ్యంలోని ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధనకు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన సిఫార్సుల తుది నివేదికను ఇవ్వనుంది. రెండేళ్లలో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.