Building Regularisation Scheme | హైదరాబాద్, ఆగస్ట్ 16 (విధాత): పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్ల స్థలాలను క్రమబద్దీకరించడానికి రేవంత్ సర్కారు వెనుకడుగు వేస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరించి, ఇంటి పట్టాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం జీవో 58, 59 విడుదల చేసింది. అయితే.. ఈ జీవోను అడ్డం పెట్టుకొని తమ పనులు కానిచ్చుకున్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వెలువడ్డాయి. బీఆరెస్ సర్కారు జీవో జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించింది కానీ వాటిని క్లియర్ చేయలేదు. చాలా నామమాత్రంగానే ఆమోదాలు లభించాయి. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కేసీఆర్ సర్కారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్లియర్ చేస్తామంటూ హడావుడి చేసింది. కానీ.. పని మాత్రం చేయలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 58, 59 కింద అప్పటికే వచ్చిన ఉన్న దరఖాస్తులను కనీసం పరిశీలించే ప్రయత్నాలూ చేయలేదు. పైగా ఏకంగా పోర్టల్‌నే మూసివేసింది. దీంతో దరఖాస్తు దారులంతా అయోమయంలో పడ్డారు. బీఆరెస్ ప్రభుత్వంలోని పెద్దలు క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున భూ దందా చేశారని నాటి ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అనేక మంది పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, అందులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారందరి ఇంటి స్థాలను క్రమబద్ధీకరించేందుకు నాటి బీఆరెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 125 గజాలలోపు భూమి విస్తీర్ణం ఉండి ఇల్లు నిర్మించుకున్న వారికి జీవో 58 కింద ఉచితంగా క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించగా 2015లో 3,46,000, 2022లో 96,000 మొత్తం కలిసి 4.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 150 గజాల పైబడిన వారికి నిర్దేశించిన చార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించేందుకు జీవో 59 కింద దరఖాస్తులను ఆహ్వానించగా 2015లో 48,394, 2022లో 72,000 దరఖాస్తులు మొత్తంగా కలిపి 1,20,394 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు జీవోల కింద 5,62, 394 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి ఆమోదంచడమో, తిరస్కరించడమే చేయకుండా గత ప్రభుత్వం అలానే పెండింగ్‌లో పెట్టింది. ఒక కేసులో ఈ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోర్టు చేసిన ఆదేశాల మేరకు కొన్ని దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిల్లో జీవో 58 కింద 2,696 తిరస్కరించి, 8963 దరఖాస్తులను ఆమోదంతో సరిపెట్టారు. జీవో 59 కింద 2750 దరఖాస్తులను తిరస్కరించారు. కానీ ఏ ఒక్క దరఖాస్తు ఆమోదించనట్లు లేదు. 59 జీవో కింద దరఖాస్తు దారుల్లో కొంతమందికి డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీస్‌లు ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మొదటి వాయిదా కింద డబ్బులు చెల్లించినా క్రమబద్దీకరణకు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. దీంతో డబ్బులు చెల్లించిన దరఖాస్తు దారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టేబుల్
జీవో | దరఖాస్తులు(2015) | అదనపు దరఖాస్తులు (2022) | తిరస్కరించినవి | ఆమోదించినవి |
58 | 3,46,000 | 96,000 | 2,696 | 8963 |
59 | 48,394 | 72,000 | 2750 | లేవు |
ఇండ్ల స్థలాలు క్రమబద్దీకరణకు నోచుకోకపోవడంతో ఆ యా ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా ఆయా భూములను క్రమబద్ధీకరిస్తే వాటిల్లో అపార్ట్‌మెంట్లతో పాటు ఇతర భారీ ఇండ్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఇంటి యజమానులు ఆయా భూములపై ఆదాయం పొందేమార్గం ఉంటుంది. అలాగే ఆ భూములను క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు ఐదారు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే క్రమంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో పాటు ఇతర మున్సిపాలిటీలు, డెవలప్‌మెంట్ అథారిటీలకు భారీ ఎత్తున ఫీజుల రూపంలో డబ్బులు వస్తాయి. నిర్మాణ రంగ యాక్టివిటీ పెరుగుతుంది. నిర్మాణదారులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మార్కెట్ కాస్త కళ కళగా కనిపిస్తే కొనుగోలు దారులు ముందుకు వస్తారు. ఇలా తెలంగాణలో మల్టిపుల్ యాక్టివిటీ జరిగి, నిధుల ప్రవాహానికి అవకాశం ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెపుతున్నారు. ప్రతి యాక్టివిటీలో ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందంటున్నారు. ప్రభుత్వం ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వాటిని మాత్రమే క్రమబద్దీకరణ చేసినా భారీగా ఆదాయం వస్తోంది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ప్రభుత్వ భూములను కాజేసే ఉద్దేశంతో ఏరో ఒక రూమ్ వేసి అక్రమంగా క్రమబద్దీకరణ చేసే ప్రయత్నం చేసిన వారి దరఖాస్తులను తిరస్కరించడమే కాకుండా అలాంటి వారిపై భూ ఆక్రమణ కేసులు పెట్టి విచారణ చేసి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని భూముల వ్యవహారాలలో అపారమైన అనుభవం ఉన్న నిపుణులు చెపుతున్నారు. ఇలా ఏమీ చేయకుండా పోర్టల్ క్లోజ్ చేసి వదిలేయడం వల్ల పేదలు ఇబ్బందిపడతారని, అర్హులైన వారు ఏమీ చేసుకోలేక పోతారని చెపుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక చొరవ చేసి చర్యలు తీసుకోవాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Urea | బర్త్ డే గిఫ్ట్‌గా ‘యూరియా’ బస్తా..! ఎక్కడో తెలుసా..?
Telangana Language Debate | తెలంగాణలో ‘భాష’ గోస.. అస్తిత్వ రక్షణే ఇప్పుడు ముఖ్యం!
మిషన్ సుదర్శన్ చక్ర – బహుళ వ్యవస్థలకు భారత్ అజేయ రక్షణ కవచం