Site icon vidhaatha

ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా మేం మద్దతిస్తాం: రాహుల్‌ గాంధీ

విధాత: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేం మద్ధతునిస్తామని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ ఉగ్రదాడిలో గాయపడి అనంతనాగ్‌ జీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. ఉగ్రదాడి జరిగిన తీరు..అనంతర పరిణామాలపై చర్చించారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో, స్థానికులతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. పహల్గావ్ ఉగ్రచర్యను విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని గుర్తు చేశారు.

భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అత్యవసరమని… తద్వారా ఉగ్రవాదులను తరిమికొట్టొచ్చు అని స్పష్టం చేశారు. ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్‌ మొత్తం ఖండించిందని.. యావత్‌ దేశం మద్దతుగా నిలిచిందన్నారు. కశ్మీర్‌తో పాటు దేశం మొత్తం నుంచి ఉన్న నా అన్నదమ్ములు, అక్కాచెల్లెమ్మలపై కొంతమంది దాడులు చేస్తున్నారని చూసి ఎంతో బాధగా ఉందన్నారు. మనందరం ఐక్యంగా నిలబడి, ఈ దారుణమైన చర్యను ఎదుర్కొని, ఉగ్రవాదాన్ని ఒకేసారి పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ సీఎం, ఎల్జీలను కలిశాను..వారు జరిగిన విషయాలను నాతో వివరించారని.. వారిద్దరికి మా పార్టీ, నేను పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నామని తెలియజేశానని పేర్కొన్నారు.

Exit mobile version