Heavy Rainfall | విధాత : ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వాన పడుతుందని పేర్కొంది. గురువారం రోజంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
శుక్రవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.