BJP Hyderabad Protest | విధాత, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో బీజేపీ శుక్రవారం తలపెట్టిన సచివాలయాన్ని ముట్టడి ఉద్రిక్తతకు..అరెస్టులకు దారితీసింది. బీజేపీ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు జిల్లాలతో పాటు..నగరంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. ఎక్కడివారిని అక్కడే నిర్భంధించారు. హౌస్ అరెస్టులు చేశారు. ఐనప్పటికి పలువురు బీజేపీ నాయకులు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు పోలీసుల కళ్లుగప్పి సచివాలయం వద్ధకు చొచ్చుకెళ్లారు.
దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు సచివాలయం గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. సచివాలయంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి తుర్కయాంజల్, అబ్ధుల్లాపూర్ మెట్ సహా పలు స్టేషన్లకు తరలించారు.