ఎన్ఎస్పీ ఈఈ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడుమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం రాష్ట్ర నాయకుడు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎన్ఎస్పీ ఈఈ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 560 అడుగుల నీరు చేరిందన్నారు. శ్రీశైలం నుండి సాగర్ ప్రాజెక్ట్ కు రోజు 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, ప్రాజెక్ట్ పూర్తిగా నిండే అవకాశం ఉన్నందున సాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేసి వానకాలం సాగు పనులలో ఉన్న రైతులందరికీ మేలు చేసి ఆదుకోవాలని కోరారు.
ప్రాజెక్టులో ఉన్న నీటిని సాగు, తాగు నీరు పేరిట ఆంధ్రా, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో ముందుగా ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని కోరారు. నీటి విడుదల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటల దిగుబడి అధికంగా రావడానికి, ప్రభుత్వ యంత్రాంగం, ఎన్ఎస్పీ అధికారులు సహకరించాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి రామ్ రెడ్డి, మండల కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు పోలేపల్లి గోవింద్ రెడ్డి, గాయం వీరారెడ్డి , లిఫ్టు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పాదూరి శశిధర్ రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, మండల పార్టీ కార్యదర్శి రవి నాయక్, కోటిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకుడు చౌగాని వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ వస్కుల సూర్యం తదితరులు పాల్గొన్నారు.