ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి: మాట నిలబెట్టుకోని హరీష్ రావు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కోయిల్ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రతి ఏడు అదనంగా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని బీఆర్‌ఎస్(BRS) హయాంలో అప్పటి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) మండిపడ్డారు. కనీసం ఐవీఆర్ షెల్ కంపెనీ ద్వారా కాలువల మరమతు పనులు చేయించలేదన్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు‌కు(Koil Sagar project) కోతవేటు దూరంలో ఉన్న అడివి అజిలాపూర్(Azhilapur) గ్రామానికి కనీసం సాగునీరు ఇవ్వని హరీష్ రావు తీరును ఎమ్మెల్యే ఎండగట్టారు.

మంగళవారం దేవరకద్ర నియోజకవర్గం‌లోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నారాయణ పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి(Parnika Reddy)తో ఆధ్వర్యంలో సాగునీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. పాలమూరు(Palamuru) జిల్లా లో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల తోనే జిల్లా సస్యశ్యామలంగా ఉందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో పాలమూరు జిల్లా లో ఒక్క ఎకరాకు అదనంగా సాగు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ. 32 కోట్ల నిధులు మంజూరూ చేసిందన్నారు. కోయిల్ సాగర్ కాలువ మరమ్మతులు, లైనింగ్ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో కాలువల లైనింగ్, మరమ్మత్తు పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.