BRS MLC Kavitha | సవాళ్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్.. కమాండ్ కంట్రోల్‌లో చర్చ పెడుదామన్న కవిత

గతంలో కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు రావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి..ఇప్పుడు ఎందుకు సెక్రటేరియట్ కు వెళ్లట్లేదని ప్రశ్నించారు. పదవి భయం పట్టుకుందని..వాస్తు బాగోలేదని సీఎం సెక్రటేరియట్‌లో కూర్చోవడం లేదని కవిత ఎద్దేవా చేశారు.

  • Publish Date - July 10, 2025 / 08:46 PM IST

BRS MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఎక్కడికంటే అక్కడికి వస్తానని సవాల్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మీకు నిజంగా చర్చ చేయాలని ఉంటే మహిళలకు ఇస్తానన్న తులం బంగారం, నెలకు రూ.2500, రూ.4 వేల పెన్షన్ లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చ పెడదాం.. ఆ చర్చకు మా మహిళలంతా వస్తారన్నారన్నారు. అంతేగాని చీటికిమాటికి కేసీఆర్ పేరుచెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు. మీరు చేస్తున్న మోసాలను గమనిస్తునే ఉన్నారన్నారని కవిత హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.. గతంలో కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు రావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి..ఇప్పుడు ఎందుకు సెక్రటేరియట్ కు వెళ్లట్లేదని ప్రశ్నించారు. పదవి భయం పట్టుకుందని..వాస్తు బాగోలేదని సీఎం సెక్రటేరియట్‌లో కూర్చోవడం లేదని కవిత ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కోసం రైతులు క్యూలైన్లు కడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగ..రేవంత్ పాలనలో దండగగా మారిందన్నారు. 42శాతం బీసీ రిజర్వేసన్ ఇస్తామన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. 42శాతం రిజర్వేషన్ బిల్లు సాధనకు జాగృతి ఈనెల 17న చేపట్టిన రైల్ రోకో విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలలోనూ అవినీతి తెచ్చారన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి..అసమర్థ ముఖ్యమంత్రి అని బిరుదు ఇచ్చామని కవిత చెప్పారు.