Mallojula Venugopal| మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ ..

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడైన సీనియర్ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అభయ్ పోలీసులకు లొంగిపోయారు. గడ్చిరోలి పోలీసుల ఎదుట తనతో పాటు 60మంది మావోయిస్టులతో కలిసి వేణుగోపాల్ రావు లొంగిపోయారు.

విధాత : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడైన సీనియర్ నాయకులు మల్లోజుల వేణుగోపాల్(Maoists Mallojula Venugopal )అలియాస్ సోను, అభయ్ పోలీసులకు లొంగిపోయారు (surrendered). గడ్చిరోలి పోలీసుల ఎదుట తనతో పాటు 60మంది మావోయిస్టులతో కలిసి వేణుగోపాల్ రావు లొంగిపోయారు. వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దివంగత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ సోదరుడైన మల్లోజుల వేణుగోపాల్ 30ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. 2026మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని..శాంతి చర్చలు ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడం..ఆపరేషన్ కగార్ మావోయిస్టులు ఏరివేతలో విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి మింగుడుపడని పరిణామం.

ఇటీవలే ప్రభుత్వంతో శాంతి చర్చల విషయంలో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ ఆ పార్టీ నాయకత్వం మధ్య విబేధాలను బహిర్గతం చేసింది. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ తాజాగా ఆయన లేఖ రాయడం మావోయిస్టు పార్టీలో విభిన్న వైఖరులను చాటింది.ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన అభిప్రాయాన్ని పార్టీ అగ్రనేతలైన హిడ్మా, దేవ్‌జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిగా వేణుగోపాల్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఇటీవల విడుదల చేసి తన అభిప్రాయాలను వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి లొంగిపోతారన్న ప్రచారం నెలకొనగా..అనుకున్నట్లుగానే వేణుగోపాల్ లొంగిపోయారు. వేణుగోపాల్ అన్న కిషన్ జీ 2011నవంబర్ 14న జరిగిన బెంగాల్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఆయన సతీమణి పోతుల సుజాతా ఇటీవలే తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. వేణుగోపాల్ భార్య తార గతంలోనే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.