న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) “సర్” పట్ల టీవీకే( TVK) అధ్యక్షుడు విజయ్(Vijay) షాకింగ్ కామెంట్స్ చేశారు. “సర్” వల్ల లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని విజయ్ ఆందోళన వెలిబుచ్చారు. నాతో పాటు తమిళనాడులోని చాలా మంది ఓటర్లు తమ రాజ్యాంగ హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సమస్యలు, తప్పుల వల్ల లక్షలాది మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రజలు వెంటనే ఓటర్ల జాబితాలో పేర్లను ధృవీకరించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేని పక్షంలో బీఎల్వో (BLO)ను సంప్రదించి తక్షణ చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేయాలని కేడర్ ను ఆదేశించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీహార్ లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్డీఏకు ఎన్నికల్లో మేలు చేసేలా ఎన్నికల సంఘం నిర్వహించిందన్న ఆరోపణలను ఇండియా కూటమి బలంగా వినిపించింది. ఎన్నికల ఫలితాలలోనూ సర్ తో ఇండియా కూటమికి జరిగిన నష్టం వెల్లడైందని, 174నియోజకవర్గాల్లో సర్ తో తొలగించిన ఓట్ల కంటే గెలిచిన అభ్యర్థులకు తక్కువ మెజార్టీ వచ్చిందని మీడియా కథనాలు వెలువరించడం గమనార్హం. సర్ తో ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు ఎన్డీఏ గెలుచుకున్న నేపథ్యంలో సహజంగానే సర్ పట్ల ప్రతిపక్ష పార్టీలలో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్నికల సంఘం మాత్రం సర్ కేవలం ఓటర్ల జాబిత ప్రక్షాళన కార్యక్రమం మాత్రమేనంటూ ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టిపారెస్తుంది. త్వరలో ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం, కేరళలలో సర్ ను అమలు చేసేందుకు సన్నద్దమైంది. ఆ రాష్ట్రాల్లోని ఎన్డీఏ యేతర పార్టీలు మాత్రం సర్ ను వ్యతిరేకిస్తున్నాయి.
