Warangal Congress | విధాత ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల మధ్య ముసలం.. తెలుగు సీరియల్‌ను తలపిస్తున్నది. రెండు వర్గాల మధ్య పంచాయితీ రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరినప్పటికీ చర్యలు చేపట్టడంలో జాప్యం పట్ల ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చిన ఎమ్మెల్యేలు.. క్రమశిక్షణ కమిటీని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులపై తాము ఫిర్యాదు చేసి రోజులు గడుస్తుంటే చర్యలు చేపట్టేందుకు ఇంకెంత కాలమంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తామే తిట్లుపడి తామే ఫిర్యాదు చేస్తే, తమనే కమిటీ ముందు హాజరుకావాలని పిలువడం పట్ల కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తారా? లేకుంటే నెలకొన్న సమస్యను సాగదీస్తారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎమ్మెల్యేలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మీరు చేసిన ఫిర్యాదుపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకే పిలిచామని వివరణ ఇచ్చారు. తమను కొండా దంపతులు బహిరంగంగా తిట్టిన విషయాలు అందిరికీ తెలిసినవేనని, దీనిపై జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా ఫ్యామిలీ కావాలో? తాము కావాలో తేల్చుకోవాలని తేల్చిచెప్పారు. తమ నియోజకవర్గాల్లో మంత్రి పేరుతో జోక్యం చేసుకోకుండా నిరోధించాలని కోరారు. తమకు ఫ్రీహ్యండ్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
రెండు గంటలపాటు చర్చ
క్రమశిక్షణ కమిటీ రెండు గంటల పాటు వారి నుంచి వివరాలు సేకరించింది. జిల్లాలో వాస్తవ పరిస్థితి, నియోజకవర్గాల్లో నెలకొన్న ఇబ్బందులు, కొండా దంపతులతో ఉన్న ప్రధాన సమస్య వంటివి ఆరా తీశారని సమాచారం. తాము పార్టీ క్రమశిక్షణకు బద్ధులమై ఉన్నామని ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన వారిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు ఉన్నారు.
త్వరలో సమస్యకు పరిష్కారంః మల్లు
వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై మల్లు రవి మాట్లాడుతూ ఇరువర్గాల నుంచి పూర్తి వివరాలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కొండా సురేఖ దంపతులు క్రమశిక్షణ కమిటీకి ముందు ఆరుపేజీల లేఖ, తర్వాత సుదీర్ఘంగా మరో లేఖ అందించి వివరాలు తెలియజేశారు. తాజాగా ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నామన్నామని త్వరలో దీనిపై ఫలవంతమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే మరోసారి వివరాలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ పతాకస్థాయికి చేరిన రచ్చ
కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ భర్త మురళి.. వరంగల్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం, రేవూరిలపై తీవ్ర విమర్శలు చేస్తూ పరుషంగా మాట్లాడటంతో జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సురేఖ దంపతులకు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు బహర్గతమయ్యాయి. కొండా దంపతుల విమర్శలతో మనస్థాపానికి గురైన ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి షోకాజ్ నోటీసు జారి చేసింది. రెండు పర్యాయాలు లేఖల ద్వారా కొండా దంపతులు తమ వివరణ ఇచ్చారు. ఈ లేఖలోని అంశాలు బహిర్గతం కావడం, మీడియాతో మాట్లాడటంతో ఇరువర్గాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఈ స్థితిలో ఎమ్మెల్యేలు తాజాగా తమ ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఇలాంటి సమస్యలను సాగదీయడం బాగా అలవాటుపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇంకెంత కాలం తీసుకుంటుందోననే చర్చ సాగుతోంది.