Site icon vidhaatha

YCP | వైసీపీ ఓటమికి బాధ్యుడు ఒకే ఒక్కడు జగన్‌!

స‌ల‌హాదారులు, అధికారుల పాత్ర ఎంత‌?
వారు ప్ర‌జ‌ల‌ను, పార్టీ నేత‌ల‌ను క‌ల‌వొద్ద‌న్నారా?
మంత్రులు బూతులు మాట్లాడితే న‌వ్వ‌మ‌న్నారా?
ప్లీన‌రీలో వక్త‌లు మాట్లాడుతుంటే ‘బాబును తిట్ట‌మంటున్నాడు’ అంటూ చెప్పించింది ఎవ‌రు?
స‌ల‌హాదారుల స‌ల‌హాలు పాటించే అల‌వాటు జ‌గ‌న్‌కు ఉందా?
మంత్రుల నోటి దురుసును ఆపాల్సింది ఎవ‌రు?
ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌కుండా ప‌ర‌దాలు క‌ట్టించింది ఎవ‌రు?
ప్ర‌జా వేదిక కూల్చ‌డం వ‌ల్ల ఒరిగిందేమిటి?
80 మందిని మార్చినా ఘోర ఓటమికి స‌ల‌హాదారులు కార‌ణ‌మా? జ‌గ‌నా?
మాజీలు జ‌గ‌న్‌ను తిట్ట‌లేక స‌ల‌హాదారులు, అధికారుల‌ను తిడుతున్నారా?

విజయానికి వెయ్యి మంది తండ్రులు ఉంటారు, కానీ ఓటమి అనాథ- అన్న జాన్‌ ఎఫ్‌ కెన్నడీ సామెత ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు బాగా స‌రిపోతుంది. మ‌రీ ముఖ్యంగా వైసీపీకి అచ్చు గుద్దిన‌ట్లు స‌రిపోతుంది. 2019 ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, 2024 ఘోర ఓట‌మికి మాత్రం ఎలాంటి బాధ్య‌త తీసుకోవ‌డం లేదు. దీంతో వైసీపీలోని క్యాడ‌ర్ మొత్తం స‌ల‌హాదారుగా ప‌నిచేసిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సీఎంవో అధికారులుగా ఉన్న ధ‌నుంజ‌య‌రెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలా విమ‌ర్శిస్తున్న వారంతా నిజాయితీగా త‌మ‌కు తాము ఈ క్రింది ప్ర‌శ్న‌లు వేసుకుంటే అస‌లు ఓట‌మికి బాధ్య‌త ఎవ‌రో ఇట్టే తెలిసిపోతుంది.

1. ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా, నీచంగా మాట్లాడుతుంటే ఏనాడూ అడ్డుకోకపోగా ఒక పిచ్చినవ్వు నవ్వుతూ వారిని మరింత రెచ్చగొట్ట‌మ‌ని జ‌గ‌న్‌కు స‌ల‌హాదారులు, సీఎంవో అధికారులు చెప్పారా?

2. కనిపించే ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం ఉండొద్దు అని జ‌గ‌న్‌కు ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారు? సెక్ర‌టేరియేట్‌కు విలువ ఇవ్వొద్దు. అసెంబ్లీకి విలువ ఇవ్వొద్దు. ఒక్క బ‌ట‌న్‌లు మాత్ర‌మే నొక్కుతూ ఉండు.. అని కూడా జ‌గ‌న్‌కు స‌ల‌హాదారులే చెప్పారా?

3. ప్రజాప్రతినిధులను కలిసేది లేదు. ప్రజలను కలిసేది లేదు. అధికారులు కూడా ఆయన పిలిచినప్పుడే కలవాలి. ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులను, ప్రజలను కలవలదల్చుకుంటే సలహాదారులు ఆపగలరా? రాజశేఖర్‌రెడ్డిని కేవీపీ ఆపగలిగారా? సజ్జల జగన్‌ను ఆపడానికి? స‌జ్జ‌ల‌ను, సీఎంవో అధికారుల‌ను విమ‌ర్శించ‌డం, ఓట‌మికి బాధ్యులను చేయ‌డం ఆత్మవంచన కాదా? జగన్‌ను తిట్టలేక, గోడను తిడుతున్నారు. అంతేనా?

4. ప్ర‌జా వేదిక విధ్వంసంతో మొదలుపెట్టి మూడు రాజధానుల పేరుతో రాజకీయ అస్థిరతకు పాదుచేసింది జగనా లేక సజ్జలనా? లేక ధ‌నుంజ‌య‌రెడ్డా?

పై ప్ర‌శ్న‌ల‌కు నిజాయితీగా స‌మాధానం చెప్పుకుంటే వ‌చ్చేది ఒక‌టే… అది జ‌గ‌న్‌.. జ‌గ‌న్‌.. జ‌గ‌న్‌. అవును వైసీపీ ఓట‌మికైనా, గెలుపుకైనా పూర్తి బాధ్య‌త తీసుకోవాల్సింది ఒక్క వైఎస్ జ‌గ‌నే.

 

వైసీపీ ఓటమికి…

– జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు కాదా?
– సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించటం కాదా?
– ఎంఎల్ఏలను, నేతలను జగన్ పట్టించుకోకపోవటం కాదా?
– ఉద్యోగుల పట్ల అనుచిత వైఖరి కాదా?
– అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చటం కాదా?
– మంత్రులుగా ఉన్న ఆర్‌కె రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, అనిల్‌కుమార్ యాద‌వ్ వంటివారి నోటి దురుసును ఆప‌క‌పోవ‌డం కాదా?
– మద్యం విధానంలో నిజాయితీ లోపించటం కాదా?
– రాజకీయాలలో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం కాదా?
– టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం కాదా?
– స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవటం కాదా?
– జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలనూ పరిష్కరించుకోకపోవటం కాదా?
– నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడటం కాదా?
– భూముల పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం కాదా?
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ‌ల్ల‌ రైతుల్లో ఏర్పడిన భయం కాదా?
– సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం కాదా?
ఇలా సవాలక్ష కారణాలు కార‌ణాల‌కు కార‌కుడైన ఒకే ఒక వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌.

స‌ల‌హాదారులు, అధికార యంత్రాంగం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌గ్గ‌ర కూడా ఉన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ వ‌ద్ద అత్యంత ప‌లుకుబ‌డిగ‌ల వ్య‌క్తిగా పేరు పొందిన స‌జ్జ‌ల కంటే, వైఎస్ ద‌గ్గ‌ర ఆయ‌న ఆత్మ‌గా చెప్పుకునే కేవీపీ రామ‌చంద్ర‌రావు కూడా ఉన్నారు. ఆయ‌న ప్ర‌తి ఫైలు చూసి చేయాలా? వ‌ద్దా అన్న‌ది కూడా రాసేవార‌ని చెబుతారు. కానీ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎప్పుడూ ప్ర‌జ‌ల‌నుంచి దూరం కాలేదు. ప్ర‌జా ద‌ర్బార్ పేరుతో వారానికి రెండుసార్లు ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్షంగా క‌లిసి వారి బాధలు వినేవారు. సామాన్య కార్య‌క‌ర్త‌నుంచి, అనేక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌చ్చే పార్టీ నేత‌ల‌తో, ప్ర‌తిప‌క్ష‌పార్టీల వారితో సైతం వైఎస్ క‌లిసేవారు. వారి విజ్ఞ‌ప్తులు వినేవారు.

చేయ‌గ‌లిగిన సాయం చేసేవారు. చివ‌ర‌కు ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం కూడా పెట్టి ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ పావురాల గుట్ట‌లో ప్ర‌మాదానికి గురై దివంగ‌తుల‌య్యారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు. త‌న సొంత తండ్రి చూపిన రాజ‌కీయ బాట క‌ళ్ల‌ముందే ఉండ‌గా, వైఎస్ జ‌గ‌న్ అది కాద‌ని, నెల‌కు ఆరు కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఐ ప్యాక్ టీంను పెట్టుకున్నారు. త‌న తండ్రి బాట‌లో న‌డిచినా వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎంతో ప్ర‌జ్వ‌లంగా ఉండేద‌న్న‌ది రాజ‌కీయ పండితుల మాట‌. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న స్వ‌యంకృతాప‌రాధాలు తెలుసుకుని, తండ్రి రాజ‌కీయ మార్గాన్ని అనుస‌రిస్తే భ‌విష్య‌త్తు ఉంటుందేమో!

Exit mobile version