ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ధ్వజం
YS Sharmila | అమరావతి : ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు పేరుకు మాత్రమే ఎంపీలుగా ఉన్నారని..వాళ్ళంతా బీజేపీకి బానిసలు అని..రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. స్వప్రయోజలే వీరికి మిన్న అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ఏపీకి చెందిన కూటమి ఎంపీలకు రాష్ట్ర హక్కుల కన్నా..ప్రధాని మోదీ మెప్పు మిన్నగా మారిందన్నారు. పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ విభజన హామీల సాధనపై లేదని విమర్శించారు. తమ నోరును హక్కుల కోసం కాకుండా మోదీ జపానికి మాత్రమే వాడతారని..నమ్మి ఓటేస్తే మతపిచ్చి పార్టీకి ఊడిగం తప్పా ఉద్ధరించింది శూన్యం అని దుయ్యబట్టారు. మోదీ చేతిలో ఏపీకి చెందిన 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు రబ్బర్ స్టాంప్స్ గా మారిపోయారని..బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలుగా తయారయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై అడిగే దమ్ములేదని.. రాజధానికి నిధులు అడిగే సత్తా లేదు..పోలవరాన్ని ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేదు అని ధ్వజమెత్తారు. అడ్డికి పావుసేరు కింద విశాఖ స్టీల్ ను అమ్ముతున్నా.. పౌరుషం ఉండదన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులపై గళం విప్పకుండా..
బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్ల తల ఊపడం తప్పా మన ఎంపీలకు ఏమి చేతకాదన్నారు.
రాష్ట్ర ఎంపీలకు దమ్ము, ధైర్యం, పౌరుషం అనేది ఉంటే..ఈ రాష్ట్ర బిడ్డలే అయితే.. మీలో పారుతుంది చీము నెత్తురే అయితే.. మోదీ తొత్తులు కాదనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యం అనుకుంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయండి అని షర్మిల సవాల్ చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ మోసాన్ని ప్రశ్నించండని..విభజన హామీలపై నోరు విప్పండని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఏమయ్యిందని అడగాలని..హోదాపై తాడోపేడో తేల్చాలని.. ఢిల్లీని తలదన్నే రాజధాని ఏదని అడగాలని షర్మిల సూచించారు. కేంద్రం బాధ్యతగా అమరావతికి నిధులు కాకుండా అప్పులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పమని రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో అడగాలన్నారు. జీవనాడి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించి ఎందుకు జీవం తీశారని ఉభయ సభలను స్తంభింపజేయండన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదని మోదీ చేత అధికారిక ప్రకటన చేయించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.