Site icon vidhaatha

IND vs NZ|సర్ఫ‌రాజ్ శ‌త‌కం, పంత్ అర్ధ‌శ‌తకం.. మ‌ళ్లీ గేమ్‌లోకి భార‌త్

IND vs NZ|బెంగ‌ళూరు టెస్ట్ ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ వ‌న్ సైడ్ అవుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో భార‌త బ్యాట్స్‌మెన్స్ అద్బుత‌మైన ఆట తీరుతో మ‌ళ్లీ గేమ్‌లోకి వ‌చ్చారు. మ్యాచ్‌లో నాలుగోరోజైన శనివారం 231/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (125 బ్యాటింగ్: 154 బంతుల్లో 16×4, 3×6) వీరోచిత శతకం బాదేశాడు. దాంతో టీమిండియా ప్రస్తుతం 344/3తో కొనసాగుతుండగా.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్ (53బ్యాటింగ్: 56 బంతుల్లో 5×4, 3×6) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ (70 పరుగులు) ఔటయ్యాడు.

52 పరుగుల వద్ద రోహిత్ శర్మ, 35 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. కోహ్లీ, సర్ఫరాజ్ మధ్య మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌటవగా.. న్యూజిలాండ్ టీమ్ 402 పరుగుల భారీ స్కోరు చేసింది. దాంతో 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ జట్టు ఇంకా 12 పరుగులు వెనకబడి ఉంది. అయితే వీలైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేసి న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలపాల‌ని భావిస్తున్నారు. కాని అది అంత సులువు కాదని క్రికెట్ పండితులు కూడా తేల్చేశారు. స‌ర్ఫ‌రాజ్‌, పంత్ ఈ రోజు అంత ఆడ‌గ‌లిగితే భార‌త్‌కి మంచి స్కోరు ద‌క్కుతుంది.

ఇంకా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితరులు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. టీమిండియా శనివారం రోజు మూడు సెషన్లు పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే.. న్యూజిలాండ్ ముందు మెరుగైన లక్ష్యం నిలిపే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌లో ఆఖరి రోజైన ఆదివారం స్పిన్నర్లకి కలిసొచ్చే ఛాన్స్ ఉండ‌గా, కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్ లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిలాండ్‌ బ్యాటర్లకి అంత సులువు కాదు. మ‌రి చూడాలి బెంగ‌ళూరు మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో..!

Exit mobile version