ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్టులో భారత్ రికార్డు విజయం

ఆఫ్ఘనిస్తాన్ జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం.

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఇన్నింగ్స్ 300పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. టెస్టుల్లో టీమ్ఇండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 113/5 స్కోరుతో సోమవారం మూడో రోజు ఆటను మొదలుపెట్టిన అఫ్గాన్ జట్టు 152 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో 412 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్..ఆ వెంటనే అఫ్గాన్‌ను ఫాలో ఆన్‌ ఆడించింది. అఫ్టాన్ జట్టు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత వేగంగా వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయానికి 98/5తో నిలిచిన ఆ జట్టు.. చివరి సెషన్‌ ఆరంభంలోనే 112 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.

అఫ్గాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సెథిఖుల్లా అటల్ (42) టాప్ స్కోరర్. రహ్మనుల్లా గుర్బాజ్ (24), రహ్మత్‌ షా (13) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, కుల్‌దీప్ యాదవ్ 3, మానవ్ సుతార్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అఫ్టాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ (6/36) వికెట్లు, ప్రసిద్ కృష్ణా 3, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ సాధించారు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్లలో రహ్మత్‌ షా (60; 135 బంతుల్లో) అర్ధ శతకం చేశాడు. టెస్టుల్లో భారత్‌పై అర్ధ శతకం చేసిన తొలి అఫ్గాన్ క్రికెటర్‌గా ఇతను ఘనత సాధించాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (126; 177 బంతుల్లో 15×4, 1×6) టాప్‌స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (100; 165 బంతుల్లో 11×4) కూడా శతకం సాధించాడు. పంత్‌ (81; 121 బంతుల్లో 6×4, 3×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌; 68 బంతుల్లో 5×4, 1×6) కూడా రాణించాడు. ప్రత్యర్థి అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌ (6/140) ఆకట్టుకున్నాడు.

Latest News