IPL 2024, SRH vs GT | మ్యాచ్​కు అడ్డుపడ్డ వర్షం – ప్లేఆఫ్స్​కు సన్​రైజర్స్​

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య నేడు జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ రద్దయింది. దాంతో చెరో పాయింట్ దక్కించుకున్న రెండు జట్లలో, 15 పాయింట్లతో సన్​రైజర్స్​ ప్లేఆఫ్స్(Sunrisers in Play Offs)కు దూసుకెళ్లింది.

  • Publish Date - May 16, 2024 / 11:28 PM IST

ఐపిఎల్​ 2024 సీజన్​లో భాగంగా నేడు హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో జరగాల్సిన 66వ మ్యాచ్​ వర్షం(Heavy rain in Hyderabad) కారణంగా రద్దయింది. గుజరాత్​ టైటాన్స్(Gujarat Titans)​, సన్​రైజర్స్​ హైదరాబాద్​(Sunrisers Hyderabad) జట్లు పోటీపడాల్సిన ఈ మ్యాచ్​కు వరుణుడు అడ్డుపడ్డాడు. హైదరాబాద్​లో నేడు ఆగకుండా కురుస్తున్న వర్షం మ్యాచ్​ను కనీసం టాస్​ కూడా వేయకుండా చేయడంతో ఒక్క బాల్​ పడకుండానే, అంపైర్లు రద్దు చేయడం(Match Abandoned)తో పాటు ఇరు జట్లకు చెరో పాయింట్​ కేటాయించారు. ఇదివరకే ప్లేఆఫ్స్​ రేసు నుండి తప్పుకున్న గుజరాత్​కు దీంతో ఉపయోగం లేకపోయినా, 14 పాయింట్లతో ఉన్న హైదరాబాద్​ 15 పాయింట్లకు చేరుకుని, నేరుగా ప్లేఆఫ్స్​లోకి అడుగుపెట్టింది. సన్​రైజర్స్​కు ఇంకో మ్యాచ్​ మిగిలిఉండటంతో ప్లేఆఫ్​ స్థానం మాత్రం ఖరారు కాలేదు.

ఇప్పుడు సన్​రైజర్స్​ ప్లేఆఫ్స్​ స్థానం ఆసక్తికరంగా మారింది. మిగిలిన మ్యాచ్​లో గెలిస్తే 17 పాయింట్లతో నిలబడుతుంది. కానీ, రెండో స్థానానికి చేరాలంటే మాత్రం కోల్​కతా చేతిలో రాజస్థాన్​ ఓడిపోవాలి. ఒకవేళ పంజాబ్​ చేతిలో ఓడిపోతే మాత్రం 3వ స్థానంలో ఉంటుంది. అప్పుడు 4వ స్థానానికి పోటీ పడేది చివరి మ్యాచ్​లు ఆడనున్న చెన్నై, బెంగళూరు, సాంకేతికంగా లక్నో(ముంబైపై భారీ తేడాతో గెలిస్తే), ఢిల్లీ(ఇతర మ్యాచ్​ల ఫలితాలు అనుకూలంగా ఉంటేనే). ఓడిపోతే రేపటితో లక్నో కథ అధికారికంగా ముగిసిపోతుంది.

ఏదేమైనప్పటికీ సన్​రైజర్స్​కు 3వ స్థానమైతే పక్కా. రెండో స్థానంలో ఉంటే రెండు అవకాశాలుంటాయి కాబట్టి ఆఖరు మ్యాచ్​లో తప్పనిసరిగా గెలిచి రాజస్థాన్​ ఓడిపోవాలని ప్రార్థించాలి.

Latest News