SA vs WI: టీ20 వరల్డ్ కప్‌లో ఆసక్తకర మ్యాచ్‌లు చోటు చేసుకుంటున్నాయి. పసికూనలు పరోక్షంగా కొన్ని టీమ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో సెమీస్‌లో నిలవాలంటే రెండు టీమ్స్ తప్పనిసరిగా గెలవాల్సి ఉండగా, సౌతాఫ్రికా జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మూడు వికెట్ల తేడాతో విండీస్‌పై గెలిచింది. ఆంటిగ్వా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. కరీబియన్ జట్టు తరపున రోస్టన్ చేజ్ 42 బంతుల్లో 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కైల్ మేయర్స్ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరు పెద్దగా రాణించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.
చివరలో ఆండ్రీ రస్సెల్ రెండు భారీ సిక్సర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే అన్రిచ్ నార్ట్జే అతనిని డైరెక్ట్ హిట్ ద్వారా రనౌట్ చేయడంతో తర్వాత ఆ జట్టుకి పరుగులు రావడం కష్టంగా మారింది. మొత్తానికి కింద మీద పడి 135 పరుగులు స్కోరు చేశారు. ఇక సౌతాఫ్రికా బౌలర్స్‌లో షమ్సీ 3 వికెట్స్ తీయగా, ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక జాన్సెన్, మార్క్రమ్, మహరాజ్, రబాడాలకి తలో వికెట్ దక్కింది. ఇక 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓపెననర్ హెండ్రిక్స్ (0) వికెట్ తొందరగానే కోల్పయింది.
ఇక డికాక్( 12), మార్క్రమ్(18) కాసేపు విండీస్ బౌలర్స్‌ని ప్రతిఘటించారు. ఇక వారు ఔటైన తర్వాత స్టబ్స్(29), క్లాసెన్ ( 22) విలువైన పరుగులు చేశారు. మధ్యలో వరుణుడు మ్యాచ్‌కి ఆటంకం కలిగించడంతో లక్ష్యాన్ని తగ్గించారు. 17 ఓవర్లలో 123కి ఫిక్స్ చేయగా, సౌతాఫ్రికా జట్టు మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా ఆల్‌రౌండర్ జాన్సన్( 21 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టుకి మంచి విజయాన్ని అందించాడు. ఇక ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్‌కి చేరింది. అలానే టేబుల్ టాప్‌లో నిలిచింది. టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా సెమీస్ చేరడం మూడోసారి. ఇక విండీస్ బౌలర్స్ లో చేజ్ మూడు వికెట్స్ తీయగా, రస్సెల్, జోసెఫ్‌లకి చెరో రెండు వికెట్స్ దక్కాయి.