T20 WC USA vs PAK | ఆ వైఫల్యమే మా కొంప ముంచింది.. ఓటమి అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

T20 WC USA vs PAK | పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో పరాజయం పాలవడంపై పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ స్పందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ తాము విఫలమయ్యామని ఆయన చెప్పాడు. ఈ వరల్డ్‌ కప్‌లో తమ తొలి మ్యాచ్‌ పసికూన అమెరికాతో ఉండటంతో అలవోకగా గెలిచి బోణీ కొట్టాలని పాకిస్థాన్‌ భావించింది. కానీ అనూహ్యంగా పరాజయం పాలైంది.

  • Publish Date - June 7, 2024 / 09:16 AM IST

T20 WC USA vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో పరాజయం పాలవడంపై పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ స్పందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ తాము విఫలమయ్యామని ఆయన చెప్పాడు. ఈ వరల్డ్‌ కప్‌లో తమ తొలి మ్యాచ్‌ పసికూన అమెరికాతో ఉండటంతో అలవోకగా గెలిచి బోణీ కొట్టాలని పాకిస్థాన్‌ భావించింది. కానీ అనూహ్యంగా పరాజయం పాలైంది.

సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ బాబర్ ఆజమ్‌ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. అమెరికా బౌలర్లు కెంజిగె (3/30), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. కెప్టెన్‌ మొనాంక్‌ పటేల్‌ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆరోన్‌ జోన్స్‌ (36 నాటౌట్‌; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆంద్రీస్‌ గౌస్‌ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూఫ్‌ తలో వికెట్ తీశారు.

స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మొదటి మూడు బంతుల్లో పాక్‌ బౌలర్‌ అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయతప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలో సమర్పించుకున్నాడు. సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

మ్యాచ్ అనంతరం ఓటమికిగల కారణాలను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ వివరించాడు. పవర్‌ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందని చెప్పాడు. ప్రత్యర్థి అమెరికా గొప్పగా ఆడిందని ప్రశంసించాడు. ‘పవర్‌ప్లేను బ్యాటుతో సద్వినియోగం చేసుకోలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు వెనుకంజలో పడుతుంటాం. ఈ స్థితిలో ఓ బ్యాటర్‌గా కుదురుకుని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంటుంది’ అన్నాడు.

‘మొదటి ఆరు ఓవర్లలో బంతితోనూ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో మా స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోయారు. ఇవన్నీ మాకు ప్రతికూలంగా మారాయి. అమెరికా జట్టుకు క్రెడిట్ ఇవ్వాలి. అన్ని విభాగాల్లో మాకంటే గొప్పగా ఆడారు. పిచ్‌లో కొద్దిగా తేమ ఉంది. అలాగే వికెట్ రెండు విధాలుగా స్పందిస్తుంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి’ అని బాబర్ అన్నాడు.

Latest News