పాకిస్తాన్ : పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ లోని ఓ గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలు మృతిచెందగా.. 10మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఫ్యాక్టరీ మేనేజర్ అరెస్ట్ కాగా, కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడుతో ఫ్యాక్టరీ చుట్టూ పక్కల ఉన్న పలు భవనాలు దెబ్బతినగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బాయిలర్ పేలుళ్లకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.
ప్రమాదంపై పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్ విచారణ వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అయితే, పాకిస్తాన్ లో ఇలాంటి పేలుడుకు సంబంధించిన ఘటనలు సర్వసాధారణమయ్యాయి. 2024లో ఇదే ఫైసలాబాద్‌లోని టెక్స్ట్‌టైల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మందికి పైగా వర్కర్లు గాయప్డారు. అలాగే, గతవారం కరాచిలోని ఓ ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీ పేలుడులో నలుగురు మరణించారు.
