Site icon vidhaatha

T20 World Cup | రేపటి నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ సంగ్రామం..! టీమిండియా షెడ్యూల్‌.. టైమింగ్స్‌ ఇవే..

T20 World Cup | రెండునెలల సుదీర్ఘ సమయం పాటు క్రికెట్‌ ప్రేమికులను అలరించిన ఐపీఎల్‌ గతవారం ముగిసింది. క్రికెట్‌ అభిమానులను మరో ఐసీసీ మెగా టోర్నీ అలరించబోతున్నది. దాదాపు నెలరోజుల పాటు టీ20 ప్రపంచకప్‌ కొనసాగబోతున్నది. జూన్‌ 2 నుంచి మొదలవనుండగా.. 29న ఫైనల్‌ జరుగనున్నది. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ను వెస్టిండ్‌తో కలిసి అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నది. అయితే, ఈ వరల్డ్‌ కప్‌లో తొలిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 20 జట్లు బరిలో నిలుస్తున్నాయి. ఐదేసి జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ స్టేజ్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు చేరుతాయి. సూపర్‌-8 అర్హత సాధించిన ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించనున్నారు. ఇందులో టాప్‌-2 జట్లు సెమీస్‌కు చేరుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు జూన్‌ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్‌లో తలపడతాయి.

గ్రూప్‌-ఏలో భారత్‌

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్‌-ఏలో ఉన్నది. భారత్‌తో కలిసి పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా సైతం ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్‌-ఏలో జరుగబోయే మ్యాచులకు అమెరికా ఆతిథ్యం ఇస్తున్నది. అయితే, ఈ మ్యాచ్‌లు భిన్న సమయాల్లో మొదలవనున్నాయి. కానీ, టీమిండియా మ్యాచ్‌లు మాత్రం భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఉదయం 9.30 గంటలకు కొన్ని, ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచులన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

టీమిండియా ఆడే వేదికలు.. సమయం..

జూన్‌ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లో రాత్రి 8 గంటలకు (స్థానిక సమయం ఉదయం 9.30)
జూన్ 9న పాకిస్థాక్‌తో న్యూయార్క్‌లో రాత్రి 8 గంటలకు (స్థానిక సమయం ఉదయం 9.30)
జూన్ 12న అమెరికాతో న్యూయార్క్‌లో రాత్రి 8 గంటలకు (స్థానిక సమయం ఉదయం 9.30)
జూన్ 15న కెనడాతో ఫ్లోరిడాలో రాత్రి 8 గంటలకు (స్థానిక సమయం ఉదయం 10.30)

భారత జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

రిజర్వ్ ప్లేయర్లు

శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్స్‌ ఇవే..

గ్రూప్‌- ఏ : భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా.
గ్రూప్‌- బీ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌.
గ్రూప్‌- సీ : అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్‌.
గ్రూప్‌- డీ : బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.

Exit mobile version