Virat Kohli|విరాట్ కోహ్లీ (Virat Kohli)ఒకప్పుడు రన్ మెషీన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన క్రీజులో ఉంటే బౌలర్లకి హడలే. కాకపోతే కొన్నేళ్లుగా పరిస్థితులు మారాయి. కోహ్లీ బ్యాటు నుండి పరుగులు రావడమే కష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌లలో కోహ్లీ పెద్దగా రాణించింది లేదు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోహ్లీ కోపంతో చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో మరోసారి ఔటవ్వబం, అంపైర్ కాల్ తనకి ప్రతికూల రివ్యూ ఇవ్వడంతో.. కోహ్లి విపరీతమైన కోపంతో ఐస్ బాక్స్‌ను బద్దలుకొట్టాడు. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఈ సంఘటన జరిగింది.
పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం అయ్యాడు. అయితే 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ వరుస వికెట్స్ కోల్పోయింది. మిచెల్ శాంట్నర్ వేసిన 29వ ఓవర్ చివరి బంతిని కోహ్లి డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకింది. న్యూజిలాండ్ అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఔటిచ్చాడు. వెంటనే కోహ్లి రివ్యూని కోరాడు. బంతి లెగ్ స్టంప్‌ను మిస్సవుతుందనే ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకున్నాడు. కానీ రీప్లే(Replay)లో బంతి లెగ్ స్టంప్‌ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్‌తో ఔట్‌గా తేల్చారు.
తాను ఔట్ అయ్యాననే కోపంతో కోహ్లీ అంపైర్‌ను ఆవేశంగా చూస్తూ మైదానాన్ని వీడాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో కోపాన్ని నియంత్రించుకోలేని కోహ్లి.. అక్కడే ఉన్న ఐస్ బాక్స్(ice Box)ను తన బ్యాటుతో బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది. మిచెల్ శాంట్నర్ మొదటి ఇన్నింగ్స్ ఏడు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు.