Site icon vidhaatha

BRS MLA’S | ఏడు నెలల్లోనే 36మంది మంది గురుకుల విద్యార్థుల మృతి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆరెస్ ఎమ్మెల్యేలు సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మండిపాటు

విధాత, హైదరాబాద్‌ : గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయార‌ని, దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డార‌ని బీఆరెస్‌ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో క‌లిసి ఎమ్మెల్యే సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. అంత‌కు ముందు మంచాన ప‌డ్డ మ‌న్యం అని వార్త‌లు చూసేవాళ్లమని, కేసీఆర్ ప‌దేండ్ల‌ పాల‌న‌లో ఆ న్యూస్ క‌న‌బ‌డ‌కుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంచాన ప‌డ్డ గురుకుల విద్యార్థులు అని రోజు వార్త‌లు వ‌స్తున్నాయని, విద్యార్థుల మ‌ర‌ణాల‌పై మంత్రులు, అధికారుల నుంచి స్పంద‌న లేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠ‌శాల‌లో ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, వారిలో ఇద్దరు మరణించార‌ని తెలిపారు. ప్ర‌భుత్వం వైపు నుంచి విచార‌ణ కూడా జ‌ర‌గ‌లేదన్నారు. గురుకుల హాస్ట‌ళ్ల‌లో నెల‌కొన్న ప‌రిస్థితిపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని కోరారు. బీఆరెస్‌ హయాంలో 1,200 గురుకులాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. గురుకులాల పనితీరును అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ, జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని గుర్తు చేశారు. కానీ నేడు అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారని ఆరోపించారు. నాసిర‌క‌మైన భోజ‌నాన్ని పిల్ల‌ల‌కు అందించ‌డంతో.. వారు తీవ్ర అస్వస్థతకు గుర‌వుతున్నారని, హాస్టళ్లలో పాములు, ఎలుకలు ఉండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. గురుకుల విద్యావ్య‌వ‌స్థ‌ను రేవంత్ స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వ‌కంగా నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఎమ్మెల్యే సంజ‌య్ మండిప‌డ్డారు.

Exit mobile version