తెలంగాణ బంద్‌కు బక్క జడ్సన్ పిలుపు , మోతీలాల్ దీక్షకు మద్దతు..అరెస్టు

నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ గాంధీ ఆస్ప‌త్రిలో కొనసాగిస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు రోజురోజుకు నిరుద్యోగుల మద్దతు పెరుగుతుంది.

  • Publish Date - July 1, 2024 / 01:55 PM IST

విధాత, హైద‌రాబాద్ : నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ గాంధీ ఆస్ప‌త్రిలో కొనసాగిస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు రోజురోజుకు నిరుద్యోగుల మద్దతు పెరుగుతుంది. సోమవారం నిరుద్యోగులు పలు ప్రాంతాల నుంచి గాంధీ ఆసుపత్రికి చేరుకోగా వారిని పోలీసులు అక్కడి నుంచి తరిమేశారు. మోతీలాల్ నాయ‌క్‌ను ప‌రామ‌ర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ నిరుద్యోగ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్న రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఎక్క‌డ దాక్కున్నాడ‌ని నిల‌దీశారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల సాదనకు మంగ‌ళ‌వారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లుగా ప్రకటించారు. నిరుద్యోగులంతా ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.
అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలు చేయాలని, జాబ్ క్యాలెండ‌ర్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Latest News