Banakacharla | సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నామని.. రేవంత్ రెడ్డి అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్ ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా పంచుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. గురువారం జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మేఘా కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి కంపెనీలు దక్కించుకున్నాయని తెలిపారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకముందే కంపెనీలకు అడ్వాన్స్ లు ఇచ్చారని కవిత ఆరోపించారు. 18నెలలో 2లక్షల కోట్లు అప్పులు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పింఛన్లను పెంచి ఇవ్వడం లేదని..మహాలక్ష్మి పథకం అమలు చేయడం లేదని కవిత విమర్శించారు. కేసీఆర్ ఆర్ఈసీ వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారని..తెచ్చిన అప్పులను కేసీఆర్ తిరిగి కట్టారని కవిత చెప్పుకొచ్చారు.
జూలై 6వ తేదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి సంవత్సరం అవుతుందని.. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాతే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారని తెలిపారు. మెగా కంపెనీకి లబ్ధి చేసేందుకు బనకచర్లను కడుతున్నారని.. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని కవిత ఆరోపించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించారని.. ఫలితంగా బనకచర్ల మొదలైందన్నారు. ఆంధ్రా బిర్యానీ ఎట్లా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారని.. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయబోరన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారని.. భద్రాచలం రాముడు మునుగుతున్నా తెలంగాణలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడం లేదని కవిత విమర్శించారు. భద్రాచలం దగ్గర ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.