విధాత : కమిషన్లు రావనే ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల డిమాండ్ తో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్, లక్ష్మీకాంత్, మల్లేష్ లు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఈటల మద్దతు తెలిపి మాట్లాడారు. కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాలు అనేకసార్లు అల్టిమేటమ్ ఇచ్చినా.. ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదన్నారు. ప్రజల పట్ల బాధ్యత లేదు, నిజాయితీ లేదు అని ఈటల మండిపడ్డారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిధులు ఉన్నాయని..కానీ విద్యార్థులకు ఇవ్వడానికి ఎందుకు లేవని ప్రశ్నించారు. కాలేజీలు సమ్మెకు నోటు ఇస్తే రూ.10వేల కోట్లలో 600 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని విమర్శించారు.
ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల కారణంగా ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న స్టాఫ్ కు జీతభత్యాలు లేవని..బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు డబ్బులు ఇవ్వక..ఆ పిల్లల చదువులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు చెల్లించకపోతే సప్లయర్స్ కలెక్టరేట్ల ముందట ధర్నాలు చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు, డైట్ చార్జీలు, బెస్ట్ అవైలబుల్ నిధులు విడుదల చేయాలని లేదంటే..ఆందోళనలు ఉదృతం చేస్తామని ఈటల ప్రభుత్వాన్ని హెచ్చరించారు.