విధాత,హైదరాబాద్:అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన ఆదేశాలకు అనుగుణంగా,రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది.అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వందశాతం అటవీ పునరుద్దరణ,అర్బన్ పార్కుల పురోగతి,హైదరాబాద్- ఆదిలాబాద్ (ఎన్ హెచ్-44) జాతీయ రహదారితో పాటు అన్ని రోడ్ల వెంట బహుళ సంఖ్యలో రహదారి వనాల పెంపకంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఆయా అంశాల్లో జిల్లాల వారీగా పురోగతిని తెలుసుకున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ,కలెక్టర్ నేతృత్వంలో సమావేశమై బ్లాకుల వారీగా అటవీ పునరుద్దరణకు ప్రణాళికలను సిద్దం చేసి, ఆమేరకు పనుల పురోగతి వివరాలను ఎప్పటి కప్పుడు నివేదించాలని అటవీ అధికారులను ఆదేశించారు.మిగతా కార్యక్రమాలకు తోడు అన్ని ప్రాంతాల్లో అటవీ పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ పనులు పూర్తి కావాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ పనుల పర్యవేక్షణకు ప్రతీ చోటా ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించాలని స్పెషల్ సీఎస్ సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ప్రతిపాదన ఉందని, ఇందులో 36 పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని,మరో 17 ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని, వివిధ దశల్లో ఉన్న 56 పార్కులను వచ్చేయేడాది మార్చి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. పట్టణాలకు సమీప అటవీ ప్రాంతాలను ఆక్రమణల నుంచి రక్షించటం, తగిన చర్యలతో జీవవైవిధ్యాన్ని పరిరక్షించటం, ప్రజలకు అహ్లాదం పంచటమే లక్ష్యంగా అర్బన్ పార్కుల అభివృద్ది జరగాలని సమావేశంలో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)శోభ వెల్లడించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. దోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ఎం.సీ. పర్గెయిన్, అన్ని జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.