Site icon vidhaatha

బీఆరెస్ డ‌బుల్ మోసం ..ఇండ్ల నిధులు వేరేవాటికి మళ్లింపు..పేదోడి సొంతింటిక‌ల నెర‌వేరేనా

50% కూడా పూర్తి కానీ డబుల్‌ ఇండ్లు
30 శాతం మాత్ర‌మే ప్ర‌భుత్వ నిధులు
నిర్మాణం కోసం గత సర్కార్‌ అప్పులు
ఇండ్ల నిధులు వేరేవాటికి మళ్లింపు
బీఆరెస్ స‌ర్కారుపై కాగ్‌ అక్షింత‌లు
ప‌త్రాలు ఇచ్చారు…పొజీష‌న్ మ‌రిచారు
చూపుల‌కే కానీ నివాస‌మేది?
పేదోడి సొంతింటిక‌ల నెర‌వేరేనా!

విధాత‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బీఆరెస్ స‌ర్కారు డ‌బుల్ మోసం చేసింది. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌కపోతే ఓట్లు అడ‌గ‌న‌ని ఈ ప‌థ‌కం ప్రారంభించిన నాడు సీఎంగా ఉన్న బీఆరెస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఆ ల‌క్ష్యం స‌గం కూడా పూర్తి కాలేదు. బీఆరెస్ స‌ర్కారు 50 శాతం ఇండ్లు కూడా పూర్తి చేయ‌లేక పోయింద‌ని కాగ్ అక్షింత‌లు కూడా వేసింది. రాష్ట్రంలో పేద‌లంద‌రికీ 5.72 ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామ‌ని బీఆరెస్ స‌ర్కారు ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు మార్చి 2018 నాటికి పూర్తి చేయ‌డానికి వీలుగా రూ.22 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కాన్ని 2016 మార్చి 5వ తేదీన నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఫామ్ హౌజ్ ఉన్న ఎర్ర‌వెల్లి గ్రామంలో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. కానీ నాటి బీఆరెస్ స‌ర్కారు ఈ ప‌థ‌కాన్ని ఓట్ల కోసం ప్ర‌చార ప‌థ‌కంగా మార్చిందా? అన్న సందేహాలు కూడా అనాడే స‌ర్వ‌త్రా వెలువ‌డ్డాయి. ప‌థ‌కం ప్రారంభించారు కానీ దీనిని పూర్తి చేసి పేద‌ల‌కు ఇండ్లు మాత్రం ఇవ్వ‌లేక పోయిందనే విమర్శలు మూటగట్టుకున్నది.

50శాతం కూడా పూర్తికాలేదన్న కాగ్‌

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను 50 శాతం కూడా కేసీఆర్ స‌ర్కారు పూర్తి చేయ‌లేక పోయిన విష‌యాన్ని కాగ్ బ‌య‌ట పెట్టింది. పైగా ఇండ్ల నిర్మాణంలో 30 శాతం మాత్ర‌మే స‌ర్కారు నిధులు కాగా మిగిలిన 70 శాతం నిధులు రుణాల ద్వారా సేక‌రించిన‌వేన‌ని కాగ్ చెప్పింది. పైగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కేటాయించిన నిధుల‌ను నాటి స‌ర్కారు దారి మ‌ళ్లించింద‌ని, దీంతో తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్ డ‌బుల్ ఇండ్ల‌కు సంబంధం లేని రుణాల‌ను కూడా చెల్లించాల్సి వ‌చ్చింద‌ని కాగ్ చెప్పింది.

ఎన్నికల వేళ భయంతోనే అప్పగింతల నిలిపివేత

కేసీఆర్ స‌ర్కారు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు హడావిడిగా 2023 సెప్టెంబ‌ర్‌ 2 నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు మూడు విడత‌ల్లో 44,020 ఇండ్ల‌ను ప్రారంభించింది. అయితే అట్టహాసంగా హ‌డావిడిగా ప్రారంభించిన ఈ డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు కేటాయించ‌లేదు. దీనిని ఒక ఎన్నిక‌ల ప్ర‌చారంగా బీఆరెస్ భావించింది కానీ ల‌బ్ధిదారుల‌కు ఇండ్లు అప్ప‌గించాల‌న్న ల‌క్ష్యం క‌నిపించ‌లేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయపడుతున్నారు.

వాస్త‌వంగా ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు ఇచ్చారు కానీ ఇండ్లు అప్ప‌గించ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు పొజిష‌న్ ఇస్తే.. ఇండ్లు రాని వాళ్లు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేస్తార‌ని, ఎవ‌రికీ ఇవ్వ‌క పోతే అంద‌రూ త‌మ‌కే ఇస్తార‌ని భావించి ఓట్లు వేస్తార‌న్న ఉద్దేశంతో నాటి బీఆరెస్ స‌ర్కారు అప్ప‌గించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో ఈ మ‌ధ్య కాలంలో కొంత మంది డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ల‌బ్ధిదారులు ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు కూడా ధ‌ర్నాలు చేశారు. డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్ధిదారుల ఎంపిక‌లో కేసీఆర్ స‌ర్కారు విఫ‌లం అయింద‌ని కాగ్ తెలిపింది. పైగా ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ ప‌రిధిలోనే నిర్మాణం పూర్తయిన ఇండ్ల‌లో 96 శాతం ఖాళీగా ఉండ‌డంతో రూ.3,983,68 కోట్లు వృథా అయిన‌ట్లు కాగ్ స్ప‌ష్టం చేసింది. ఏళ్లు గ‌డిచినా పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాల‌న్న ల‌క్ష్యం నెర‌వేరలేద‌ని కాగ్ నివేదించడం గ‌మ‌నార్హం.

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప‌థ‌కం వాస్త‌వంగా 2018 నాటికి 2.72 ల‌క్ష‌ల ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించి ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల‌ని, 2024 మ‌రో 3 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయాల‌ని నాటి స‌ర్కారు ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ది. కానీ 2022 న‌వంబ‌ర్ నాటికి 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్త‌యింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో 10 నుంచి 15 వేల ఇండ్ల వ‌ర‌కు నిర్మాణం పూర్త‌యిన‌ట్లు అధికారులు చెపుతున్నారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1.40 ల‌క్ష‌ల పైచిలుకు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్ర‌మే పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్రారంభించింది 44,020 ఇండ్లు మాత్రమే.

లబ్ధిదారుల్లో ఆందోళన

నిర్మాణం పూర్త‌యిన ఇండ్లు అప్ప‌గించ‌క పోవ‌డంతో ల‌బ్ధిదారులు అందోళ‌న చెందుతున్నారు. ల‌క్ష్యంగా 5.75 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం పెట్టుకున్న బీఆరెస్ స‌ర్కారు కేవ‌లం 2,91,057 ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో 2.75 ల‌క్ష‌ల ఇండ్ల‌ను 2018 మార్చి నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొని 9,500 ఇండ్ల‌ను మాత్ర‌మే పూర్తి చేసింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ల‌క్ష్యం స‌గం కూడా నెర‌వేర‌లేదు.

ఇందులో 1.69 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి కావ‌చ్చింద‌ని ప్ర‌భుత్వ లెక్క‌లు చెపుతున్నాయి. కానీ వాస్త‌వంగా 1.40 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం పూర్త‌యిన‌ట్లు అధికారులు చెపుతున్నారు. అయితే నిర్మాణం పూర్త‌యిన ఇండ్ల‌ను కూడా బీఆరెస్ స‌ర్కారు నాడు ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించ‌లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా వీటిని ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేస్తుందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

డబుల్‌ ఇళ్లపై సమీక్షించని రేవంత్‌ సర్కార్‌

సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌పైన ఒక్క‌సారి కూడా స‌మీక్ష చేయ‌క‌పోవ‌డంతో ఈ ఇండ్ల ప‌రిస్థితి ఏమిట‌న్న చర్చ జ‌రుగుతోంది. అలాగే అనేక ఇండ్లు స‌గం నిర్మాణంలోనే ఆగిపోయాయ‌ని, వాటిపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డ‌బుల్ ఇండ్ల కాల‌నీలు, వ‌రంగ‌ల్‌లో నిర్మించిన కాల‌నీల‌లోని ఇండ్ల‌న్నీ వృథాగా ప‌డి ఉండ‌డంతో అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు అడ్డాలుగా మారుతున్నాయ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు కేటాయించిన ఇండ్ల‌ను అప్ప‌గించ‌క పోవ‌డం మోసం కాక మ‌రేమిట‌ని ల‌బ్ధిదారులు ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొర‌వ చేసి త‌మ‌కు ఇండ్లను కేటాయించాల‌ని కోరుతున్నారు.

Exit mobile version