Warangal | వరదలో బీఆర్ఎస్ బురద రాజకీయం..బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

వరద ముంపునకు గురైన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని, జిల్లాను కేసీఆర్కుటుంబం నాశనం చేసిందని మండిపడ్డారు

విధాత, వరంగల్ ప్రతినిధి:

వరద ముంపునకు గురైన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని, జిల్లాను కేసీఆర్కుటుంబం నాశనం చేసిందని మండిపడ్డారు. గతంలో వరద ముంపునకు గురైతే ఫోటోలకు ఫోజులిచ్చేవారని, ఈ దఫా సీఎం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా నిలిచేందుకు ఆర్ధిక సహాయాన్ని విడుదల చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈమేరకు హనుమకొండలో గురువారం వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు స్వర్ణ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు జిల్లాలో మళ్ళీ ప్రవేశం లేకుండా చేయాలని కోరారు.

వరద బాధితులకు ఆర్ధిక సహాయం అందిచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ జిల్లాకు రూ. 7.03 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ. 5.05 కోట్లు, మొత్తం రూ. 12.08 కోట్ల వరద సాయం మంజూరుచేశారన్నారు. పశ్చిమలో 48 కాలనీలు నీట మునిగాయని, 4,790 ఇళ్లు వరద నీటిలో దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నష్టానికి ప్రభుత్వం రూ. 7 కోట్ల 18 లక్షల 50వేల నిధులు విడుదలయ్యాయన్నారు. గత ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, హామీలు ఇచ్చి, ప్రజల కష్టాలను మరచిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు చేతలతో చూపిస్తోందన్నారు. జనం బాట పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి కవిత బయలుదేరిందని ఎద్దేవా చేశారు. మీ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాస్ రావు, అజీజ్ ఖాన్, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.