– ఎన్నికల్లో ‘రైతన్నే’ బీఆర్ఎస్ ఎజెండా
– గులాబీ పార్టీ తాజా రాజకీయం
– రేవంత్ పాలనపై గులాబీల విమర్శ
– కరువు చుట్టూ నేతల రాజకీయం
– రంగంలోకి దిగిన పార్టీ అధినేత కేసీఆర్
– మూడు జిల్లాలలో సాగిన కేసీఆర్ పర్యటన
విధాత ప్రతినిధిః అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోగొట్టుకున్న ప్రతిష్టను పోగుచేసుకునేందుకు పార్లమెంట్ ఎన్నికలను వేదికగా చేసుకునేందుకు ఆ పార్టీ పాకులాడుతోంది. మెడమీద కత్తిలాగా వచ్చిపడిన ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు వీలైన మార్గాలను అణ్వేషిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తనదైన పద్ధతుల్లో రాజకీయ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆసరాచేసుకుని ఆ పార్టీని ఇరుకునపెట్టి ప్రజల నుంచి సానుభూతిని పొందాలని భావిస్తోంది. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను దీనికి జోడించి కాంగ్రెస్ హామీలు, కరువు ఎజెండాగా కార్యాచరణ కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రజల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని బీఆర్ఎస్ ప్రణాళికబద్దంగా ప్రచారం ప్రారంభించిది.
– కాంగ్రెస్ హామీలు…
కరువు పైన గురి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను తమ రాజకీయ లక్ష్యానికి వినియోగించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చేపట్టారు. తొలుత ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ఆ పార్టీ ప్రారంభించిన ప్రచారానికి రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను జోడించి నెమ్మదిగా తమ రాజకీయ ప్రయోజనానికి మళ్ళించడం ఆసక్తికరంగా మారింది. వచ్చిన కరువు కాదు…. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రైతాంగ సమస్యల పై అగ్గిపుట్టిద్దామంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నీళ్ళులేక పంట పోలాలు ఎండిపోయి రైతులు గగ్గోలుపెడుతున్న పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రచారంలో కరువుకు కాంగ్రెస్ పార్టీయే కారణమనే అంశం ప్రధానమైంది.
– రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం కానీ కెసిఆర్ తాజా పరిస్థితులలో ఆదివారం మూడు జిల్లాలు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలలో లో పర్యటించడం విశేషం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు జనగామ,సిరిసిల్ల ప్రాంతంలో పర్యటించారు. నలగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తూ రైతుల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వీరికి కెసిఆర్ తోడు కావడంతో కరువును, రైతాంగ సమస్యలను ఎజెండాగా చేసుకుని అధికార కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
– ఎన్నికల్లో ` రైతన్న ` ఎజెండా
పార్లమెంట్ ఎన్నికల్లో అన్నదాత ఎజెండాగా బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలను ప్రయోగిస్తోంది. మొన్నటి వరకు రూ.2లక్షల రుణమాఫీని అమలు చేయాలంటూ డిసెంబర్ 9 నుంచే ప్రచారానికి తెరతీశారు. రైతులపట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదంటూ రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదంటూ విమర్శించారు. వంద రోజుల సమయమిస్తామంటూనే ఈ సన్నాయి నొక్కులు చేపట్టారు.
మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోయి బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ట మసకబారిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో మొదట కాళేశ్వరం గురించి మాట్లాడిన కేసీఆర్ పిల్లర్లు కుంగిపోయిన మరుసటి రోజు నుంచి మేడిగడ్డ పై నోరెత్తకుండా ఎన్నికల్లో ఎజెండా కాకుండా జాగ్రత్తవహించారు. ఎన్నికలు ముగిసి అధికారం కోల్పోయిన తర్వాత మేడిగడ్డ పై స్పందించలేదు. కాంగ్రెస్ దీనిని ఎజెండా చేయడంతో నల్లగొండ సభలో మేడిగడ్డకు పీకనీకి పోతున్నారా? బొందలగడ్డ అంటూ కెసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పెద్దగా ఏం జరుగలేదంటూ చెబుతూ వచ్చారు. మేడిగడ్డను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితికి తోడు, జలశయాల్లో నీటి నిల్వలులేని పరిస్థితికి అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు. కరువుకు కాంగ్రెస్ కారణమంటూ విమర్షిస్తోందీ. బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ కాసింత వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే సమన్వయం లోపం, తమ అధినేతను టార్గెట్ చేస్తే తమకేంటి అనే కొందరి నాయకుల జాఢ్యం, అంతర్గతంగా పార్టీలో ఉండే గ్రూపు తగదాలు, పార్టీలో తమ స్వంత ప్రయోజనానికి తోడు లోక్ సభ ఎన్నికల హడావుడితో ధీటైన సమాధానం చెప్పకపోవడంతో రైతుల్లో సెంటిమెంట్ పెరిగే ప్రమాదం ఉంది. గత ఐదేళ్ళు నీళ్లోచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు రావట్లదనే ప్రచారం ప్రభావం చూపనుంది. కాగా, ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుకాలేదు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని విస్మరించి కరువుకు కారణం కాంగ్రెస్ అంటూ ప్రాజెక్టుల్లో నీళ్ళు నిల్వా ఉన్నా కూడా విడుదల చేయడంలేదనే రీతిలో ప్రచారం చేపట్టి, పార్టీ ఫిరాయింపులకు గేట్లు ఎత్తినట్లు ప్రాజెక్టుల గేట్లు ఎత్తు సీఎం అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ మెనిఫెస్టో కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించి వంద రోజుల్లో అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలను అవకాశంగా తీసుకుని బీఆర్ఎస్, బీజేపీ ఒత్తిడి చేస్తున్నాయి. ఒకవైపు హామీలు అమలు చేస్తుండగా మరోవైపు రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను విపక్ష నేతలు వినియోగించుకుంటున్నారని విమర్శిస్తున్నారు.