Harish Rao | వ్యవసాయరంగం (Agriculture sector)లో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూగజీవుల మౌన రోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందుల కొరత ఉన్నదని, 1962 పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
పశుసంవర్ధక శాఖ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందన్నారు.. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలుగా నిలిచిపోయిందన్నారు., పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో మూగజీవాలకు చికిత్స అందించలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితిలో మందుల చిట్టీ రాసి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. వానాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నిపశువైద్య శాలల్లో, పశువైద్య సంచార వాహనాల్లో అవసరమైన మందులు ఉండేలా చూడాలని, నట్టల నివారణ మందులు సరఫరా చేయాలని, 1962 పశువైద్య సంచార వాహనాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని బీఆరెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని లేఖలో పేర్కొన్నారు.