Site icon vidhaatha

Telangana budget 2024 | అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్‌.. కేబినెట్ ఆమోదం

గవర్నర్ అనుమతి
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి..మండలిలో శ్రీధర్‌బాబు
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ 2024-25వార్షిక పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సిద్ధమయ్యారు. ఉదయం తన నివాసం ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీ హాల్‌కు చేరుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోసం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణకు బడ్జెట్‌ పద్దును అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకున్నారు.

అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, సీఎం రేవంత్‌ రెడ్డికి బడ్జెట్‌ ప్రతులను అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో భట్టివిక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌వేశ‌పెట్టిన ఓటాన్ అకౌంట్ ప‌ద్దు రూ. 2.75 ల‌క్ష‌ల కోట్లు. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమయం ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బ‌డ్జెట్ దాదాపు రూ. 2.95 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉండనుందని సమాచారం.

సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్ పద్దుపై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు ఉంటుంది. 29, 30 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీకి హాజరవుతున్నారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకతో అసెంబ్లీ సమావేశాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version