పవర్ కమిషన్ చైర్మన్‌ను మార్చండి
కేసీఆర్ పిటిషన్‌పై సీజేఐ కీలక ఆదేశాలు
చైర్మన్‌ను మార్చేందుకు ప్రభుత్వం అంగీకారం
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కి ఎదురు దెబ్బ
విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహారాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు
చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు బయటకి ఎలా చెప్తారు అంటూ సూటి ప్రశ్న
న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని కీలక వ్యాఖ్యలు
విచారణ బాధ్యతల నుంచి తప్పుకున్న నరసింహారెడ్డి
సోమవారం కొత్త చైర్మన్‌ను నియమిస్తామన్న ప్రభుత్వం
కేసీఆర్ పిటిషన్ డిస్మిస్
విధాత, హైదరాబాద్ : చత్తీస్‌గడ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు..భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశించారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని చంద్రచూడ్ తప్పు పట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని, విచారణ అంశాలు బయటకు ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని, కమిషన్ చైర్మన్‌గా మరో జడ్జిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. లంచ్ తర్వాతా 2గంటలకల్లా కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని స్పష్టం చేశారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిషేక్ సంఘ్వీ తాము చైర్మన్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు నివేదించారు. కేసీఆర్ తరుపునా న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్తు కమిషన్ ఏర్పాటు, చైర్మన్ నరసింహారెడ్డి తీరు నిష్పక్షపాతంగా లేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేశారని, చైర్మన్ నరసింహారెడ్డి విచారణ శైలి, ప్రెస్‌మీట్ అంతా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఉందని, కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్‌ను మార్చాలని స్పష్టం చేసింది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. చైర్మన్ మార్చాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విద్యుత్తు కమిషన్ అంశంలో ఎదురుదెబ్బగా తగిలింది. తక్షణమే రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కలెక్టర్ల సదస్సు మధ్యలోనే బయటకు వెళ్లి సుప్రీంకోర్టులో విద్యుత్తు కమిషన్‌పై జరిగిన వాదోపవాదాలు, సీజేఐ ఆదేశాలపై ఏజీ సుదర్శన్‌రెడ్డి ద్వారా తెలుసుకున్నారు. కమిషన్ చైర్మన్‌గా ఉన్న ప్రస్తుత జడ్జి ఎల్. నరసింహారెడ్డి స్థానంలో నియమించబడే మరో జడ్జి ఎంపికపై నిపుణులతో సంప్రదింపలు చేపట్టారు.
అయితే భోజన విరామ సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్తు కమిషన్ విచారణ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా జస్టిస్ నరసింహారెడ్డి ఓ న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు లేఖ పంపించారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి సుప్రీంకోర్టు సమయమిచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ మేరకే కొత్త జడ్జిని నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని పేర్కోంది. జ్యుడీషియల్ విచారణ అనకుండా.. ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. సోమవారంలోపు నూతన చైర్మన్‌ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. అనంతరం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రోహత్గీ తన వాదనలో విద్యుత్తు విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో విద్యుత్తు కొనుగోలు చేశామని, మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్ రూ.3.90లకు మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ‘‘నేను మాజీ ముఖ్యమంత్రిని. ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక సార్లు ఆర్‌టీఐ వేశారు. ఇది కక్ష సాధింపు చర్య. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ మీడియా సమావేశం పెట్టి మరీ చెప్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారని కేసీఆర్ తరుపు వాదనలను ముకుల్ రోహత్గీ వినిపించారు. కాగా విద్యుత్తు కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్‌ను అంతకుముందు తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు నూతన జడ్జిని నియమించిన పక్షంలో కొత్తగా వచ్చే చైర్మన్ సారధ్యంలోని కమిషన్ ముందు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదో వేచి చూడాల్సివుంది.